Gujarat Titans: అద్భుత విజయంతో ఐపీఎల్ ఫైనల్లోకి గుజరాత్ టైటాన్స్

  • క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం
  • 62 పరుగుల భారీ తేడాతో ఓడిన ముంబయి ఇండియన్స్
  • 234 పరుగుల లక్ష్యఛేదనలో ముంబయి 171 ఆలౌట్
  • ఎల్లుండి ఫైనల్లో చెన్నైతో తలపడనున్న గుజరాత్ టైటాన్స్
Gujrat Titans enters IPL final by beating Mumbai Indians in qualifier 2

హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. గతేడాది టైటిల్ నెగ్గి సంచలనం సృష్టించిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరోసారి టైటిల్ పోరాటానికి సిద్ధమైంది. 

ఇవాళ ముంబయి ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ 62 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. 234 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన ముంబయి ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 4 వికెట్లు పడగొట్టగా, షమీ 2, రషీద్ ఖాన్ 2, జోష్ లిటిల్ 1 వికెట్ తీశారు. 

ముంబయి ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తిలక్ వర్మ 43, కామెరాన్ గ్రీన్ 30 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (8), నేహాల్ వధేరా (4), టిమ్ డేవిడ్ (2), విష్ణు వినోద్ (2) ఘోరంగా విఫలమయ్యారు. 

అసలు, టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడమే ముంబయి ఇండియన్స్ కు బెడిసికొట్టింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 129 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడగా, గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 233 పరుగులు చేసింది. 

లక్ష్యఛేదనలో 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ముంబయి ఇండియన్స్ కు కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కొంచెం ఊపునిచ్చినా... కీలక సమయాల్లో వీళ్లు అవుట్ కావడంతో ముంబయి ఓటమి దిశగా పయనించింది. సాధించాల్సిన రన్ రేట్ భారీగా ఉండడంతో ముంబయి చివరి వరుస బ్యాట్స్ మెన్ ఏమీ చేయలేకపోయారు. 

కాగా, ఈ విజయంతో ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ ఈ నెల 28న టైటిల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తో అమీతుమీకి సిద్ధమైంది. ఇవాళ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. క్వాలిఫయర్-1లో చెన్నై చేతిలో గుజరాత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మరి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందో, లేక చెన్నైకి మరోసారి దాసోహం అంటుందో చూడాలి.

More Telugu News