Imran Khan: విదేశాలకు పారిపోకుండా ఇమ్రాన్ ఖాన్ ను నో ఫ్లై లిస్టులో చేర్చిన పాక్ ప్రభుత్వం

  • కొనసాగుతున్న ఇమ్రాన్ ఖాన్ కష్టాలు
  • నో ఫ్లై లిస్టులో ఇమ్రాన్ ఖాన్ పేరు
  • ఇమ్రాన్ ఖాన్ భార్యపైనా నిషేధం
  • త్వరలో పీటీఐ పార్టీని బ్యాన్ చేసే అవకాశం
Pakistan govt includes Imran Khan name in no fly list

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కష్టకాలం కొనసాగుతోంది. ఇటీవలే అరెస్టయిన ఇమ్రాన్ ఖాన్ సుప్రీంకోర్టు జోక్యంతో అతికష్టమ్మీద విడుదలయ్యారు. ప్రధానిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆయనపై 150 వరకు కేసులు నమోదయ్యాయి. తీవ్రవాద ఆరోపణలతోనూ కొన్ని కేసులు నమోదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను ఇబ్బందిపెట్టే ఏ అవకాశాన్నీ అక్కడి ప్రభుత్వం వదులుకోవడంలేదు. 

తాజాగా, ఇమ్రాన్ ఖాన్ దేశం విడిచి పారిపోకుండా నో ఫ్లై లిస్టులో ఆయన పేరు చేర్చింది. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ, ఇమ్రాన్ పార్టీ పీటీఐకి చెందిన పలువురు నేతల పేర్లను కూడా ప్రభుత్వం నో ఫ్లై జాబితాలో పొందుపరిచింది. 

దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఇతర దేశాల్లో తనకేమీ ఆస్తులు, వ్యాపారాలు లేవని, బ్యాంక్ అకౌంట్లు అంతకన్నా లేవని... తనను నో ఫ్లై జాబితాలో చేర్చినందుకు కృతజ్ఞతలు అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యంగ్యం ప్రదర్శించారు. 

పాక్ మీడియా కథనం ప్రకారం 600 మంది పీటీఐ నేతలను ప్రభుత్వం నో ఫ్లై లిస్టులో చేర్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, అసలు పీటీఐ పార్టీనే లేకుండా చేయాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. మే 9న జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని, పీటీఐ పార్టీపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ తెలిపారు.

More Telugu News