Chattisgarh: ఫోన్ పడిందని.. రిజర్వాయర్ నే తోడేశారు.. ప్రభుత్వ అధికారి నిర్వాకం!

smartphone fell in reservoir in chattisgarh food officer drained dam for 3 days
  • సెల్ఫీ దిగుతుండగా రిజర్వాయర్ లో పడిపోయిన ఫోన్‌
  • దాని కోసం ఒకేరోజు 21 ల‌క్ష‌ల లీట‌ర్ల నీటిని తోడించిన ఫుడ్ ఇన్ స్పెక్టర్
  • మూడు రోజుల తర్వాత దొరికిన ఫోన్.. 
  • ఇరిగేషన్ కు పనికి రాని నీళ్లే తోడేశామన్న సదరు అధికారి
  • విషయం వెలుగులోకి రావడంతో సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
అసలే ఎండాకాలం.. తాగు నీటికి, సాగు నీటికి కటకట ఉంటుంది. ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ బాధ్యత గల ప్రభుత్వ పదవిలో ఉన్న ఓ వ్యక్తి మ‌తిలేని చ‌ర్య‌కు దిగారు. తన స్మార్ట్‌ఫోన్ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డింద‌ని.. ఆ ఫోన్‌ను తీసేందుకు ఒకేరోజు సుమారు 21 ల‌క్ష‌ల లీట‌ర్ల నీటిని తోడించారు. పంట పొలాల అవసరాల కోసం నిల్వ చేసిన నీటిని వృథా చేశారు. చత్తీస్ గఢ్ లోని కంకేర్ జిల్లాలోని కొయాలిబేడా బ్లాక్‌లో జరిగిందీ ఘటన. 

కంకేర్ జిల్లాలోని ఖేర్‌క‌ట్టా రిజర్వాయర్ వద్దకు త‌న మిత్రుల‌తో క‌లిసి ఫుడ్ ఇన్ స్పెక్టర్ రాజేశ్ విశ్వాస్ గత ఆదివారం పిక్నిక్ కు వెళ్లారు. అయితే సెల్ఫీ దిగుతున్న స‌మ‌యంలో ఫోన్ ఆ డ్యామ్‌లో ప‌డింది. రూ.96 వేల విలువైన ఆ ఫోన్‌లో విలువైన డేటా ఉంద‌న్న కారణంతో తొలుత ఫోన్ కోసం ఈతగాళ్ల‌తో అన్వేషించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆ ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ కాక‌పోవ‌డంతో, నీటిని తోడేయాల‌ని ప్రయత్నించారు.

15 అడుగుల లోతైన ఆ డ్యామ్ నుంచి 30 హెచ్‌పీ డీజిల్ పంపుల‌తో ఒకే రోజు 21 ల‌క్ష‌ల లీట‌ర్ల నీటిని తోడించేశారు. కానీ ఫోన్ దొరక్కపోవడంతో మూడు రోజుల పాటు నీటిని తోడించేశారు. 41,104 క్యూబిక్ మీటర్ల నీళ్లు వృథాగా పోయాయి. ఆ నీరు ఉండుంటే 1,500 ఎకరాలకు ఉపయోగపడేవి. మూడు రోజులకు ఫోన్ దొరికింది. అయితే అప్పటికి అది వర్కింగ్ కండిషన్ లో లేదు.

తాను చేసిన పనిని రాజేశ్ విశ్వాస్ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ‘‘పంప్ చేసింది నీటిపారుదలకి పనికిరాని మురుగునీరు. నా వ్యక్తిగత మొబైల్ కావడం, అందులో ముఖ్యమైన కాంటాక్ట్స్ ఉన్నందున రికవరీ కోసం ప్రయత్నం చేశాం. 3-4 అడుగుల లోతు వరకు నీటిని ఖాళీ చేయడానికి కంకేర్ నీటిపారుదల శాఖ ద్వారా మౌఖిక అనుమతి తీసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. 

‘‘నీటి పారుదలకి పనికిరాని వ్యర్థ జలాలను ఉంచే ఆనకట్టలోని భాగం ఇది. డీజిల్ పంపుతో నీరు ఖాళీ చేశాం. దీని ఖర్చు రూ.7,000-8,000 మాత్రమే. నీళ్లు తోడటం వల్ల ఏ ఒక్క రైతు కూడా నష్టపోలేదు’’ అని చెప్పడం గమనార్హం. విషయం వెలుగులోకి రావడంతో రాజేశ్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు.
Chattisgarh
Reservoir
food inspector
Kherkatta Paralkot

More Telugu News