Farmers: ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీ... భగ్గుమన్న అమరావతి రైతులు

Amaravati farmers protests in a strong way that govt distributing lands
  • నేడు ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీ
  • 50,793 మందికి ఇళ్ల స్థలాలు
  • రాజధాని ప్రాంతంలో తీవ్రస్థాయిలో పెల్లుబికిన నిరసనలు
  • నల్ల దుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి రైతుల ఆందోళనలు
  • తుళ్లూరులో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం
అమరావతి సీఆర్డీయే పరిధిలో 50,793 మందికి ఏపీ ప్రభుత్వం నేడు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆర్-5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీని అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము రాజధాని నిర్మాణం, అభివృద్ధి కోసం భూములు ఇచ్చామని, తమ జీవనాధారమైన భూములను ఆర్-5 జోన్ పేరుతో ఇతరులకు ఇవ్వడం ఏంటని రైతులు నిలదీస్తున్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేస్తే తమకు లభించిన ప్రతిఫలం ఇదా అని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ ఉసురు తగలడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు.

ప్రభుత్వ చర్యను విమర్శిస్తూ పలు గ్రామాల్లో రైతులు  నిరసనలు చేపట్టారు. ఇప్పటికే అమరావతి జేఏసీ నల్ల రిబ్బన్లు, నల్ల దుస్తులతో శాంతియుత నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రాజధాని ప్రాంతంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరేయాలని సూచించింది. 

ఈ క్రమంలో రైతులు ఆందోళన చేపట్టేందుకు తుళ్లూరు శిబిరం నుంచి బయటికి రాగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 

అదే సమయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కారులో అటుగా వచ్చారు. దాంతో రైతులు బిగ్గరగా నినాదాలు చేశారు. పోలీసులు ఎమ్మెల్యే శంకరరావు వాహనాన్ని అక్కడ్నించి జాగ్రత్తగా పంపించారు. 

అటు, వెలగపూడి శిబిరంలో నల్ల జెండాలు, నల్ల బెలూన్లలో మహిళలు, రైతులు నిరసన తెలిపారు. గో బ్యాక్ రాజధాని ద్రోహుల్లారా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

సీఎం జగన్ ఇవాళ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ మందడం శిబిరంలోనూ ఆందోళన చేపట్టారు. ఇక్కడి రైతులు ఉరితాళ్లతో నిరసనలు తెలిపారు. రైతుల ఆందోళనలను ముందుగానే ఊహించిన పోలీసులు... ప్రత్యేక నిఘా ఉంచారు. అమరావతి జేఏసీ నేతలు బయటికి రాకుండా ఎక్కడిక్కడ గృహ నిర్బంధం విధించారు.
Farmers
Amaravati
R5 Zone
Lands
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News