Bihar: సివంగుల్లా తలపడిన టీచర్-ప్రిన్సిపాల్.. వీడియో ఇదిగో!

Principal and teacher exchange blows inside school in Bihar
  • బీహార్‌లోని పాట్నా జిల్లాలో ఘటన
  • వ్యక్తిగత వైరంతోనేనన్న విద్యాశాఖ అధికారులు
  • ఇద్దరికీ నోటీసులు
  • ఉన్నతాధికారుల దృష్టికి విషయం
ఓ పాఠశాల మహిళా ప్రిన్సిపాల్, టీచర్ సివంగుల్లా తలపడ్డారు. ఇద్దరూ కలబడి కిందపడి కొట్టుకున్నారు. చెప్పులకు కూడా పనిచెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. బీహార్‌లోని పాట్నా జిల్లా కౌరియా పంచాయతీలోని బిహ్తా మిడిల్ స్కూల్‌లో జరిగిందీ ఘటన. 

టీచర్, ప్రిన్సిపాల్ తలపడుతుంటే విద్యార్థులందరూ చుట్టూ చేరి వినోదం చూశారు. మరికొందరు ఆ ఘటనను సెల్‌ఫోన్లలో బంధించారు. తొలుత తరగతి గదిలో టీచర్, ప్రిన్సిపాల్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ బయటకొచ్చి కలబడ్డారు. వారిని ప్రిన్సిపాల్ కాంతి కుమారి, టీచర్ అనితా కుమారిగా గుర్తించారు. వ్యక్తిగత వైరంతోనే వారు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. వారిద్దరూ కిందపడి దొర్లుతూ కొట్టుకుంటుంటే మూడో మహిళ జోక్యం చేసుకుని చెప్పుతో మరో మహిళను కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. 

వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ గొడవపడి కొట్టుకున్నట్టు విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. తాత్కాలిక ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ మధ్య గొడవ జరిగిందని చెప్పారు. వారిద్దరికీ నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ఆ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Bihar
Patna
School Teacher
School Principal

More Telugu News