Nara Lokesh: ​దళితుల ఓట్లతో గెలిచిన జగన్ ఇప్పుడు వారిని గాలికొదిలేశారు: నారా లోకేశ్

  • జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • లోకేశ్ కు గ్రామాల్లో ఘనస్వాగతం 
  • లోకేశ్ కు తమ సమస్యలు చెప్పుకున్న పలు గ్రామాల ప్రజలు
  • దళితులు, మైనారిటీలకు భరోసా ఇచ్చిన టీడీపీ అగ్రనేత
Lokesh take a swipe at CM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 110వ రోజు కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో జన నీరాజనాల నడుమ ముందుకు సాగింది. అడుగడుగునా ప్రజలు లోకేశ్ కు ఎదురేగి ఆత్మీయ స్వాగతం పలుకుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. 

పెద్దముడియం గ్రామ ప్రజలు, పెద్ద పసుపుల దళితులు, పెద్ద పసుపుల గ్రామస్తులు, జమ్మలమడుగు మైనారిటీలు లోకేశ్ ను కలిసి మాట్లాడారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి లోకేశ్ ముందుకు సాగారు. 

ఈ సందర్భంగా లోకేశ్ ఏమన్నారంటే...

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. గ్రామాలకు నిధులివ్వకపోగా, గ్రామ పంచాయతీల్లోని రూ.8,660 కోట్లను సర్పంచ్ లకు తెలియకుండా దొంగిలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో 25వేల కి.మీ సీసీ రోడ్లు, 30 లక్షల ఎల్ఈడీ లైట్లు వేశాం. 

మేం అధికారంలోకి వచ్చాక సుద్దపల్లెకు, పొలాలకు వెళ్లే పుంతరోడ్డును నిర్మిస్తాం. కుందూనది ముంపు సమస్యను పరిష్కరించి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం. రాజోలి ప్రాజెక్టును 2.95 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించి, ఆ మేరకు నిర్వాసితులందరికీ పరిహారం ఇస్తాం. పెద్దముడియంలో కళ్యాణ మండపం, మైనారిటీలకు షాదీఖానా నిర్మిస్తాం. ఇంటర్ చదివే విద్యార్థుల సంఖ్యను బట్టి జూనియర్ కళాశాల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తాం. 

జగన్ పాలనలో పేదలు, దళితుల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. జగన్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో ఆరోగ్య రంగం కుప్పకూలింది. కర్నూలు, అనంతపురం వంటి పెద్దాసుపత్రుల్లో సైతం కనీసం దూది, గాజుగుడ్డలేని దుస్థితి నెలకొంది. గ్రామపంచాయితీల నిధులను ప్రభుత్వం దొంగిలించడంతో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా వారి వద్ద నిధుల్లేవు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక జమ్మలమడుగు దళితకాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఇంటింటికీ కుళాయి అందజేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. జగన్మోహన్ రెడ్డి దివాళా ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదు. 

కొన్నిచోట్ల పరువు కోసం సొంత డబ్బుతో పనులు చేసిన సర్పంచ్ లు ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులకు రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి గిట్టుబాటు ధర కల్పిస్తానన్న సీఎం, ఎన్నికల తర్వాత ముఖం చాటేశారు. రైతులు పండించే ప్రతిపంటకు గిట్టుబాటు ధర కల్పించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. 

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మైనారిటీలకు చెందాల్సిన రూ.5,400 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారు. రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీలకు చెందిన వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసీపీ నేతలు యథేచ్ఛగా అన్యాక్రాంతం చేస్తున్నారు. నర్సరావుపేటలో మసీదు స్థలం కబ్జాను అడ్డుకున్న ఇబ్రహీంను దారుణంగా నరికి చంపారు. 

పేద ముస్లింల వివాహానికి కానుకగా ఇచ్చే దుల్హన్ పథకాన్ని అడ్డగోలు నిబంధనలతో పూర్తిగా నీరుగార్చారు. దుల్హన్ పథకం కింద టీడీపీ హయాంలో 32,722 మందికి 163.61 కోట్లు అందజేస్తే, వైసీపీ ప్రభుత్వం ఊరికి ఒకరిద్దరికి కూడా పథకాన్ని ఇవ్వలేదు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకంలో వైసీపీ పెట్టిన షరతులన్నీ తొలగిస్తాం, అర్హులందరికీ పథకం అమలు చేస్తాం. గతంలో మైనారిటీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి మైనారిటీల స్వావలంబనకు కృషి చేస్తాం. 

యువగళం వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1423.7 కి.మీ.

25-5-2023న నడిచిన దూరం 12.3 కి.మీ.

మహానాడు సందర్భంగా 26-5-2023 నుంచి 29-5-2023 వరకు పాదయాత్రకు విరామం.

30వ తేదీన జమ్మలమడుగు బైపాస్ రోడ్డు క్యాంప్ సైట్ నుంచి 111వ రోజు పాదయాత్ర ప్రారంభమవుతుంది.

******

More Telugu News