Transfers: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త... బదిలీలకు సీఎం జగన్ ఆమోదం

CM Jagan gives nod to transfers in village and ward secretariats
  • గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం
  • రెండేళ్లు పూర్తయిన వారికి ప్రొబేషన్
  • తాజాగా జిల్లా, అంతర్ జిల్లాల బదిలీలకు నిర్ణయం
  • వివరాలు వెల్లడించిన ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో 1.67 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఆ శాఖలో మూడేళ్లుగా బదిలీలు లేవు. ఈ నేపథ్యంలో, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కారు శుభవార్త చెప్పింది. దీనిపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పందించారు. 

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఉంటుందని తెలిపారు. రెండేళ్లు పూర్తయి, ప్రొబేషన్ డిక్లేర్ అయిన వారు బదిలీలకు అర్హులని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 

పనిచేస్తున్న జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం ఉందని వివరించారు. అంతర్ జిల్లాల బదిలీల్లో స్పౌస్, మ్యూచువల్ బదిలీలకు వీలుందని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
Transfers
Village/Ward Secretariat
CM Jagan
Venkatramireddy
YSRCP
Andhra Pradesh

More Telugu News