New Parliament: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై సుప్రీంకోర్టులో పిల్

  • ఈ నెల 28న మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం
  • రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయాలంటూ పిల్
  • రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్న పిటిషనర్
PIL filed in Supreme Court seeking President should inaugurate

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ను భారత రాష్ట్రపతి మాత్రమే ప్రారంభించాలని... ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ కు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలయింది. సుప్రీంకోర్టు న్యాయవాది సీఆర్ జయ సుకిన్ ఈ పిల్ వేశారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతిని భాగస్వామిని చేయకపోవడం ద్వారా భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని పిల్ లో ఆయన పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత చట్ట సభ పార్లమెంట్ అని... పార్లమెంటులో భారత రాష్ట్రపతితో పాటు రెండు సభలు లోక్ సభ, రాజ్యసభ ఉంటాయని తెలిపారు. లోక్ సభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుందని చెప్పారు. రాష్ట్రపతిని పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం సరికాదని అన్నారు. పార్లమెంట్ శంకుస్థాపనకు కూడా రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, ఇప్పుడు ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానించలేదని చెప్పారు. మరోవైపు పార్లమెంట్ ను మోదీ ప్రారంభించడాన్ని నిరసిస్తూ విపక్షానికి చెందిన 20 పార్టీలు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

More Telugu News