Kohli Kohli: ‘కోహ్లీ’ జపం చేయనీయండి.. మరింత ఉత్సాహం వస్తుంది: నవీనుల్ హక్

  • అతడి పేరును లేదా మరో ప్లేయర్ ను స్మరించుకోనీయండి
  • బయటి వ్యక్తుల మాటలను పట్టించుకోవక్కర్లేదన్న నవీనుల్
  • ఇలాంటివి నెగ్గుకురావడం తెలుసన్న లక్నో బౌలర్
Naveen u Haq on Kohli Kohli chants I enjoy it gives me passion to play well for my team

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్, ఆప్ఘనిస్థాన్ జాతీయుడు నవీనుల్ హక్ ను కోహ్లీ అభిమానులు ప్రతిచోటా టార్గెట్ చేస్తున్నారు. మే 1న లక్నోలో ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీకి, నవీనుల్ హక్ కు మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత వీరి మధ్య సోషల్ మీడియా పోస్ట్ లలోనూ గొడవ కొనసాగింది. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ అయిన కోహ్లీకి అభిమానులు ఎక్కువ. దీంతో అప్పటి నుంచి లక్నో జట్టు ఎక్కడ ఆడినా, కోహ్లీ ఫ్యాన్స్ అతడిని లక్ష్యం చేసుకుంటున్నారు. 

మ్యాచ్ సమయంలో కోహ్లీ కోహ్లీ అంటూ నినాదాలు చేస్తున్నారు. తద్వారా నవీనుల్ హక్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో సన్ రైజర్స్ - లక్నో మ్యాచ్ సందర్భంగా, చెన్నైలో తాజాగా ముగిసిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంలోనూ అభిమానులు కోహ్లీ జపం చేశారు. అయినా కానీ, వాటిని పట్టించుకోకుండా నవీనుల్ హక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను అవుట్ చేశాడు. కోహ్లీతో అతడికి గొడవ అయిన తర్వాత.. కోహ్లీ పేరుతో అతడ్ని ఫ్యాన్స్ ఆట పట్టించడం ఇది నాలుగో సారి. 

ఈ నినాదాలపై నవీనుల్ స్పందన కోరగా.. వాతావరణాన్ని ఎంతో ఆస్వాదించినట్టు చెప్పాడు. ఈ నినాదాలు తనను తన జట్టు కోసం మరింత గొప్పగా ఆడేలా ఉత్సాహాన్నిస్తాయని పేర్కొన్నాడు. ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఇలాంటి సందర్భాలను ఎలా నెగ్గుకు రావాలో తెలుసన్నాడు. మ్యాచ్ తో సంబంధం లేని వాళ్ల మాటలకు ప్రభావితం కాకూడదన్నాడు. 

‘‘నేను ఆ మాటలను ఎంతో ఎంజాయ్ చేశాను. గ్రౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ అతడి పేరును లేదా మరో ప్లేయర్ పేరును స్మరించడం నేను ఇష్టపడతాను. నా జట్టు కోసం గొప్పగా ఆడేంత స్ఫూర్తిని నాకు అది ఇస్తుంది. బయటి వైపు శబ్దాలపై నేను దృష్టి పెట్టను. నేను నా క్రికెట్ పైనే మనసు పెడతాను’’ అని స్పష్టం చేశాడు. నిజమే, నవీనుల్ చెప్పినట్టే ఆటపై మరింత ఫోకస్ పెట్టాడు. నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీశాడు.

More Telugu News