Nara Lokesh: ​వ్యవసాయ మంత్రి ఎక్కడ?: లోకేశ్

  • జమ్మలమడుగు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • 109వ రోజు ఉత్సాహంగా యువగళం
  • రైతులు, ముంపు బాధితులతో లోకేశ్ ముఖాముఖి
  • సీమను రైతు లేని రాజ్యంగా మార్చారని జగన్ పై విమర్శలు
  • వ్యవసాయశాఖ మంత్రి కనిపించడంలేదని బోర్డు పెట్టాలంటూ ఎద్దేవా
Lokesh asks where is agriculture minister

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగుతోంది. 109వ రోజు యువగళం పాదయాత్ర జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లి నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు, యువకులు, వృద్ధులు యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు గండికోట, రాజోలి గండికోట ప్రాజెక్టుల నిర్వాసితులు, రైతులతో లోకేశ్ సమావేశమై వారి కష్టాలు తెలుసుకున్నారు. 

పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె వద్ద యువగళం పాదయాత్ర 1400 కి.మీ. మజిలీని చేరుకుంది. ఈ సందర్భంగా గండికోట నిర్వాసితులకు ఉపాధి కల్పించే చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు లోకేశ్ శిలాఫలకం ఆవిష్కరించారు. 

నాలుగేళ్ల పాలనలో రైతులేని రాజ్యంగా మార్చేశారు!

ఎన్నికల ముందు జగన్ రైతు రాజ్యం తెస్తానని చెప్పాడని లోకేశ్ వెల్లడించారు. 108 రోజులుగా సీమలో పాదయాత్ర చేస్తున్నా... కానీ ఇక్కడంతా రైతు లేని రాజ్యంగా కనిపిస్తోందని విమర్శించారు. జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లిలో గండికోట, రాజోలు రిజర్వాయర్ల ముంపు బాధితులు, రైతులతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోతున్నామని ఇక్కడి రైతులు చెబితే... కాదు రైతుల తప్పిదాలతోనే వాళ్లు నష్టపోతున్నారని ఎంపీ రిపోర్టులు తయారు చేయించారని మండిపడ్డారు.

"మోటార్లకు మీటర్లు పెట్టి రాయలసీమ రైతులకు జగన్ ఉరితాడు బిగించబోతున్నాడు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉంది. డ్రిప్ కు సబ్సీడీ ఎత్తేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అందించడం లేదు" అని ఆరోపించారు.

నిర్వాసితులను మోసగించిన జగన్!

పోలవరం, గండికోట, రాజోలి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తియ్యని మాటలు చెప్పి మోసం చేశాడు. రైతులకు కనీసం ఇప్పుడు ట్రాన్స్ ఫార్మర్లు కూడా ఇవ్వడంలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పిస్తాం. 

2014లో కడప జిల్లాలో టీడీపీ తరఫున ఒక్క ఎమ్మెల్యేనే గెలిచారు. అయినా రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించాము. పులివెందులకు నీళ్లు కూడా అందించాము. 2019లో అన్ని స్థానాల్లో వైసీపీని గెలిపించారు. మీ జీవితాలు ఏమైనా మారాయా? సీఎం సొంత జిల్లాలో పనులు కావడం లేదంటే ఆలోచించండి. 

గండికోట నిర్వాసితుల సమస్య గాలికొదిలేశారు!

2020లో జగన్ ఇక్కడికి వచ్చి గండికోటలో 26 టీఎంసీల సామర్థ్యం ఏర్పాటు చేయడం తన అదృష్టం అని జగన్ అన్నారు. బాధితులకు న్యాయం చేస్తానని కూడా హామీ ఇచ్చారు. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే మీ సమస్యలు తీరుతాయి. రూ.665 కోట్లతో నాడు చంద్రబాబు మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించడానికి నిధులు కేటాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక రాత్రికి రాత్రి పోలీసులను పెట్టి మిమ్మల్ని ఖాళీ చేయించారు. సీఎం సొంత జిల్లాలోనే రైతులకు న్యాయం చేయకపోతే రాష్ట్రంలోని రైతులకు ఏం న్యాయం చేస్తాడు? 

ఇన్ పుట్ సబ్సిడీ ఎత్తేశారు!

ఈ ప్రభుత్వం వచ్చాక ఇన్ పుట్ సబ్సీడీ రద్దు చేసింది. పెట్రోల్, డీజల్ ధరలు పెరగడంతో ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి. పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రావడం లేదు. జగన్ కు మతిమరుపు ఎక్కువ. పొద్దున చెప్పింది... సాయంత్రానికి గుర్తు ఉండదు. సీఎం ఒక సభా వేదికగా హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. శనగకు రూ.4,800 మద్దతు ధరతో గతంలో మేము మద్ధతు ధర అందించాము. రాయలసీమ నుండి వెళ్లేలోపు సీమకు ఏం చేయబోతున్నామో వెల్లడిస్తాం. సీమలో మామిడి, టమోటాకు ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి. 

రాజోలి రిజర్వాయర్ సామర్థ్యంపై పూటకోమాట!

రాజోలి ప్రాజెక్టు సామర్థ్యం గతంలో 2.9 టీఎంసీలు అని చెప్పి, ఇప్పుడు 1.6 టీఎంసీలు అని జగన్ అంటున్నారు. పూటకో మాట మాట్లాడటం వల్ల రైతులు ఇబ్బంది పడతారు. ముంపు వాసులకు పరిహారం రూ.20 లక్షలు ఇవ్వాలన్న దానిపై పార్టీ అధిష్ఠానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. టీడీపీ హయాంలో చేతినిండా పని ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రైతుల నుండి వెయ్యి ట్రాక్టర్లు ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. 

పెద్దాపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ పై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పూర్తి సమాచారం తెలుసుకుని దీనిపై హామీ ఇస్తా. వ్యవసాయ శాఖ మంత్రి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి ఏనాడైనా రైతుల వద్దకు వచ్చారా? వ్యవసాయ శాఖ మంత్రి కనబడటం లేదని బోర్డు పెట్టాలి.

అధికారంలోకి వచ్చాక పరిహారం అందజేస్తాం

మామిడి, చీని, దానిమ్మ వంటి హార్టి కల్చర్ పంటలను ప్రోత్సహించాలి. ఉపాధిహామీని గతంలో హార్టి కల్చర్ కు అనుసంధానం చేసే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. కొత్త రకాల మామిడి తీసుకురావాలి. మామిడి పరిశోధనాకేంద్రం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల్లో పరిహారం రాని వాళ్లకు అధికారంలోకి వచ్చాక పరిహారం అందిస్తాం. 

*యువగళం వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1411.4 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 18.4 కి.మీ.*

*110వ రోజు (25-4-2023) పాదయాత్ర వివరాలు:*

*జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం(కడప జిల్లా)*

ఉదయం

7.00 – ఎన్.కొత్తపల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.30 – పెద్దపసుపుల జంక్షన్ లో పెద్దముడియం గ్రామస్తులతో సమావేశం.

8.45 – పెద్దపసుపుల చర్చి వద్ద క్రిస్టియన్లతో సమావేశం.

8.55 – పెద్దపసుపుల చావిడి వద్ద గ్రామస్తులతో సమావేశం.

11.00 – జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ముస్లింలతో సమావేశం.

11.10 – జమ్మలమడుగు బైపాస్ రోడ్డు విడిది కేంద్రానికి చేరిక.

******


More Telugu News