MS Dhoni: నేను నిర్ణయం తీసుకోవడానికి 8 నెలల సమయం ఉంది: ధోనీ

  • డిసెంబర్ లో వేలం ఉంటుందని వెల్లడి
  • ఇప్పుడే ఆ తలనొప్పి ఎందుకని ప్రశ్న
  • తగినంత సమయం ఉందన్న సీఎస్కే సారథి
MS Dhoni on retirement plans I have 8 months to decide

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ అంశం కొంత కాలంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదే చివరి ఏడాది అని కొందరు, లేదు ధోనీ మరికొన్నేళ్లపాటు సేవలు అందిస్తాడని మరికొందరు అంచనా వేస్తున్నారు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ ఈ అంశంపై పెదవి విప్పాడు. 41 ఏళ్ల చెన్నై సారథి స్పందిస్తూ.. తాను ఐపీఎల్ లో కొనసాగడంపై నిర్ణయం తీసుకోవడానికి తగినంత సమయం ఉన్నట్టు చెప్పాడు. 

‘‘నాకు తెలియదు. నాకు 8-9 నెలల సమయం ఉంది నిర్ణయించుకోవడానికి. ఆ తలనొప్పి ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి? వేలం డిసెంబర్ లో జరుగుతుంది’’ అని ధోనీ పేర్కొన్నాడు. తద్వారా తన రిటైర్మెంట్ విషయమై కాస్త వేచి చూడాలన్న సందేశం పంపాడు. గుజరాత్ పై విజయం సాధించి ఐపీఎల్ 2023 ఫైనల్ కు చేరిన తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడాడు. 

‘‘నేను ఎప్పుడూ సీఎస్కే కోసం వస్తూనే ఉంటాను. జనవరి నుంచి ఇంటికి దూరంగా ఉన్నాను. మార్చి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఐపీఎల్ చాలా పెద్దది. పది జట్లు. రెండు నెలలకు పైగా కష్టం. ఎన్నో పాత్రలు. ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారు. మిడిలార్డర్ కు తగినంత అవకాశం రాలేదు. కానీ, మేము ఉన్న స్థానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. జీటీ అద్బుతమైన జట్టు. వారు ఛేజింగ్ కూడా బాగానే సాగింది. టాస్ ఓడడం మంచిదైంది. జడ్డూకి (జడేజా) పరిస్థితులు అనుకూలిస్తే అతడ్ని ఎదుర్కోవడం చాలా కష్టం. అతడి బౌలింగ్ ఆటను మార్చేసింది. మోయిన్ తో అతడి పార్ట్ నర్ షిప్ ను కూడా విస్మరించకూడదు’’అని సీఎస్కే కెప్టెన్ ధోనీ వివరించాడు. 

తాను చిరాకు తెప్పించే కెప్టెన్ నని ధోనీ పేర్కొన్నాడు. ‘‘వికెట్ ను, పరిస్థితులను చూడాలి. దానికి తగినట్టు ఫీల్డ్ ను సర్దుబాటు చేయాలి. ఫీల్డ్ ను ప్రతిసారీ మారుస్తుంటాను కనుక నేను ఇబ్బంది పెట్టే కెప్టెన్ నే. ఇది చిరాకు తెప్పించొచ్చు. కానీ నేను నా అంచనాలను నమ్ముతాను. అందుకే నావైపు చూడండి అంటూ ఫీల్డర్లకు చెబుతాను’’ అని ధోనీ వివరించాడు.

More Telugu News