NTR: వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు... హాజరైన రామ్మోహన్ నాయుడు

  • టీడీపీని గెలిపించడమే ఎన్టీఆర్ కు నివాళి అన్న రామ్మోహన్
  • చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరమని ఉద్ఘాటన
  • ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి
NTR Centenary Celebrations in Washington DC

తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తానా పూర్వాధ్యక్షుడు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. 

ముఖ్య అతిథులుగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 

అంతకుముందు ఊరేగింపుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకువచ్చారు. మహిళలు పసుపుపచ్చ చీరలు ధరించి, ర్యాలీగా తరలివచ్చి హారతులు ఇచ్చారు. ఈ వేడుకకు పరిమితికి మించి ఎన్టీఆర్ అభిమానులు వేలాదిగా తరలిరావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఉదయం 10 గంటలకే అభిమానులు పోటెత్తారు. కొన్ని మైళ్ళ వరకూ ట్రాఫిక్ లో ఇరుక్కున్నా చిన్నారులు సైతం సభాస్థలికి నడిచి చేరుకున్నారు. 

ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం ఉందని అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుండటం మనందరికీ గర్వకారణం అని తెలిపారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని తెలిపారు. 

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు అందరికీ ఆదర్శం అయ్యాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగుజాతి కోరుకుంటోందని, ఈ దిశగా కేంద్రం అడుగులు వేయాలని కోరారు. 

కాగా, ఎన్టీఆర్ స్వతహాగా భోజన ప్రియుడు కావడంతో 100 రకాల వంటకాలతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.

More Telugu News