Dimple Hayati: డీసీపీతో వివాదం నేపథ్యంలో ఆసక్తి కలిగిస్తున్న డింపుల్ హయతి ట్వీట్

  • ట్రాఫిక్ డీసీపీతో డింపుల్ హయతి వివాదం
  • ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టిన డింపుల్ హయతి కారు
  • డింపుల్ పై కేసు నమోదు
  • అధికార దుర్వినియోగంతో తప్పులను దాయలేరన్న డింపుల్
Dimple Hayati cryptic tweet

హైదరాబాదులోని జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న యువ హీరోయిన్ డింపుల్ హయతిపై కేసు నమోదు కావడం తెలిసిందే. అదే అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును డింపుల్ హయతి కారు ఢీకొన్నట్టు ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో డింపుల్ హయతి చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. 

ఈ గొడవ ఇప్పటిది కాదని ఆమె ట్వీట్ ద్వారా అర్థమవుతోంది. అధికార దుర్వినియోగంతో తప్పులు దాచిపెట్టలేరు అని డింపుల్ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ వివాదంలో డీసీపీ కూడా స్పందించారు. అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్లేసులో కారు అడ్డుగా పెట్టవద్దు అని డింపుల్ ను చాలాసార్లు రిక్వెస్ట్ చేశామని, కానీ ఆమె నిర్లక్ష్యంగా కారు అడ్డుగా పెట్టేదని, చాలాసార్లు తమ సిబ్బందే ఆమె కారును పక్కన పార్క్ చేయాల్సి వచ్చేదని రాహుల్ హెగ్డే వివరించారు. ఓసారి ఇలాగే పార్కింగ్ లో కారు అడ్డుపెట్టడంతో అది తీసేదాకా వేచి ఉండడంతో సౌత్ జోన్ కు వెళ్లడం ఆలస్యం అయిందని వెల్లడించారు. 

ట్రాఫిక్ డీసీపీ వాదన ఇలా ఉంటే... ఇటీవల కొన్ని రోజులుగా డింపుల్ హయతి కారుపై భారీగా చలాన్లు విధించినట్టు తెలుస్తోంది. అవన్నీ జూబ్లీహిల్స్ పరిధిలోనివే కావడం గమనార్హం. డీసీపీతో గొడవ నేపథ్యంలో, కావాలనే తన కారుపై చలాన్లు వేస్తున్నారని డింపుల్ హయతి పరోక్షంగా చెప్పేందుకే అధికార దుర్వినియోగం అంటూ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది.

More Telugu News