Sajjala Ramakrishna Reddy: వైసీపీకి ఎవరూ లేరని అనుకుంటున్నారా.. కడుపు మంటతో ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తారా?: సజ్జల మండిపాటు

  • అవినాశ్ రెడ్డి వ్యవహారంలో ఎల్లో మీడియా రోత రాతలు రాస్తోందన్న సజ్జల
  • కుటుంబాన్ని పలచన చేస్తున్నారని, తల్లికి బాగాలేదంటే డ్రామాలని అంటారని ఆవేదన
  • కొంపలు అంటుకుపోతున్నాయన్నట్లు రాస్తే అభిమానులు రాకుండా ఉంటారా? అని ప్రశ్న
  • ఎవరైనా కాస్త ఆవేశానికి లోనైతే మీడియా మీద దాడి అంటున్నారని వ్యాఖ్య
  • అవినాశ్ వెంటపడాల్సిన అవసరమేంటని, ఆయనేమైనా పారిపోతున్నారా అని నిలదీత
Sajjala Ramakrishna Reddy on MP Avinash Reddy Issue

ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యవహారంలో ఎల్లో మీడియా రోత రాతలు రాస్తోందని, అసత్యాలు ప్రచారం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘కుటుంబాన్ని పలచన చేస్తున్నారు. తల్లికి బాగాలేదంటే డ్రామాలని అంటారు. ఇలా చేస్తే కడుపుమండకుండా ఉంటుందా? మీ మీద కూడా ఇలానే రాస్తే ఒప్పుకుంటారా?’’ అని నిలదీశారు. 

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అవినాశ్ రెడ్డి ఇప్పటిదాకా ఆరు సార్లు సీబీఐ ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన సహకరిస్తున్నారు. ఎక్కడికీ పారిపోలేదు. ఆయన తల్లికి బాగాలేదు. తండ్రి జైలులో ఉన్నారు. అందుకే విచారణకు రాలేనని లేఖ రాశారు. ఈ విషయంలో ఏం జరిగినా.. అది సీబీఐకి, ఆయనకు మధ్య జరిగే వ్యవహారం. పోలీసులతో మాట్లాడి సీబీఐ అధికారులు వాళ్ల పని వాళ్లు చూసుకుంటారు’’ అని తెలిపారు.

‘‘కానీ ఎల్లో మీడియా మాత్రం.. పారామిలిటరీ ఫోర్సెస్ వస్తున్నాయని రాస్తారు. ఎక్కడొస్తున్నాయి బలగాలు? వస్తున్నాయని నువ్వే రాస్తావు? మళ్లీ బలగాలు రాకుండా ఏదో చేశారనీ రాస్తావు. ఏదో భయంకరమైనది జరుగుతున్నట్లు రాసి.. మళ్లీ ఏమీ జరగలేదని రాస్తారు. కథ మీరు సృష్టిస్తారు.. ఆరోపణలు మీరే చేస్తారు’’ అని అన్నారు. 

‘‘వైఎస్సార్ సీపీకి ఎవరూ లేరనుకుంటున్నారా? కార్యకర్తలు, అభిమానులు కోట్ల మంది ఉన్నారు. ఏదో జరిగిపోతోంది.. కొంపలు అంటుకుపోతున్నాయి అని రాస్తే ఆసుపత్రి దగ్గరికి రాకుండా ఉంటారా? పార్టీ అభిమనులు, కుటుంబ అభిమానులు వస్తారు. బాధనో, ఆవేశమో కలిగి, ఏమిటీ అన్యాయమని వాళ్లు వస్తారు’’ అని చెప్పారు.  

‘‘అవినాశ్ రెడ్డి వెంటపడాల్సిన అవసరమేంటి? ఆయనేమైనా అండర్ గ్రౌండ్ నుంచి ఆ రోజే బయటికి వచ్చారా? నెల నుంచి కనపడకుండా, పారిపోయి బయటికి వచ్చారా? బెంగళూరు వైపు వెళ్లారా? ఇంకోవైపు వెళ్తారా? అంటూ ఊహాగానాలు ఎందుకు? ఏం పరారవుతున్నారా? ఇలాంటి వార్తలు రాసి, అభిమానుల ఎదుటో, ఇంకెవరి ఎదుటో మీరు కనిపిస్తే ఎవడో రియాక్ట్ అయ్యి దాడి చేస్తాడు’’ అని చెప్పారు.  

‘‘సీబీఐ అరెస్ట్ చేస్తామంటే ఎస్పీ సహకరించలేదు అని ఎవరు చెప్పారు? మీడియా క్రియేట్ చేసిన తుపాను దెబ్బకు ఆసుపత్రి వద్దకు పార్టీ, ఆయన అభిమానులు.. ఏంటి ఈ అన్యాయం అని వస్తారు. ఎవరైనా కాస్త ఆవేశానికి లోనైతే మీడియా మీద దాడి అంటున్నారు. ఎవరైతే కరుడు గట్టిన వారు ఉంటారో వాళ్లకు ఆవేశం వస్తుంది’’ అని అన్నారు. 

‘‘అవినాశ్ టైం అడిగారు.. ఇస్తే ఏమవుతుంది? టైం తీసుకొని అప్పటికీ రాకపోతే అరెస్ట్ చేస్తారు. హైదరాబాద్, బెంగళూరుకు ఎందుకు అవినాశ్ తల్లిని తీసుకు వెళ్లలేదు అంటారు. కర్నూలు ఎందుకు తీసుకువచ్చారని అడుగుతారు’’ అని మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

More Telugu News