Junior NTR: 9 మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అరెస్ట్.. కారణం ఇదే..!

Junior NTR fans arrested in Krishna District
  • తారక్ 40వ జన్మదినం సందర్భంగా 'సింహాద్రి' రీరిలీజ్
  • రెండు మేకలను నరికి తారక్ ఫ్లెక్సీపై రక్తాన్ని చిందించిన అభిమానులు
  • కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు
సినీ హీరోలపై ఫ్యాన్స్ కు ఉండే అభిమానం అంతాఇంతా కాదు. తమ అభిమాన నటుల కోసం వారు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఈ అత్యుత్సాహం కొన్నిసార్లు వారిని ఇబ్బందులపాలు చేస్తుంటుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఇలాగే చిక్కుల్లో పడ్డారు. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చెమ్మనగరిపేటలో సిరివెంకట్, సిరికృష్ణ థియేటర్ వద్ద అభిమానులు రెండు మేకలను వధించి వాటి రక్తాన్ని తారక్ ఫ్లెక్సీపై చిందించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న జూనియర్ అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేశారు. 

ఈ ఘటన ఈ నెల 20న జరిగింది. తారక్ 40వ జన్మదినం సందర్భంగా అభిమానుల కోసం 'సింహాద్రి' సినిమాను రీరిలీజ్ చేశారు. ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, పోలీసులు చర్యలకు దిగారు. వీడియోల ఆధారంగా 9 మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై కేసు నమోదు చేశారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు.
Junior NTR
Fans
Arrest

More Telugu News