Amit Shah: ఓటర్ లిస్ట్ తో జననమరణాల డేటా లింక్.. త్వరలో పార్లమెంట్ లో బిల్లు!

  • ఏర్పాట్లు ప్రారంభించినట్లు వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
  • 18 సంవత్సరాలు నిండగానే ఆటోమేటిక్ గా ఓటు హక్కు వస్తుందని వెల్లడి
  • జనన మరణాల రికార్డులు సరిగ్గా నిర్వహిస్తే జనాభా లెక్కల్లో కచ్చితత్వం ఉంటుందని వివరణ
Bill To Link Birth Death Data With Electoral Rolls Soon says Amit Shah

ఓటర్ జాబితాలో మరింత పారదర్శకత కోసం త్వరలో కొత్త బిల్లును తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జనన మరణాల వివరాలను ఓటర్ జాబితాతో లింక్ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈమేరకు సోమవారం ఆయన ఢిల్లీలో జనగణన భవన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. జనగణనలో కచ్చితత్వం ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చే పథకాలు నిరుపేదలకు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. జనన మరణాల రికార్డులను సరిగ్గా నిర్వహించడం ద్వారా అభివృద్ధి పనులకు మరింత స్పష్టతతో ప్రణాళికలు రచించవచ్చని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే జనన మరణాల సమాచారాన్ని ఓటర్ జాబితాతో లింక్ చేయాలని భావిస్తున్నట్లు అమిత్ షా వివరించారు. ఇందుకోసం పార్లమెంట్ లో ప్రత్యేకంగా బిల్లు పెట్టనున్నట్లు చెప్పారు. డిజిటల్ రికార్డులను అనుసంధానించడం ద్వారా ఓ వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే ఆటోమేటిక్ గా ఓటర్ల జాబితాలో పేరు నమోదు అవుతుందని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఎలక్షన్ కమిషన్ కు ఆ సమాచారం చేరుతుందని, ఓటర్ జాబితాలో నుంచి ఆ వ్యక్తి పేరును తొలగించే ప్రక్రియను చేపట్టవచ్చని అమిత్ షా వివరించారు. అంతేకాదు, జనన మరణాల రికార్డులను సరైన పద్ధతిలో నిర్వహిస్తే జనాభా లెక్కల్లో కచ్చితత్వం పెరుగుతుందని అమిత్ షా వివరించారు.

More Telugu News