Meta: ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు రూ.10 వేల కోట్ల భారీ జరిమానా

  • మెటాకు జరిమానా వడ్డించిన ఈయూ అనుబంధ సంస్థ డీపీసీ
  • యూరప్ దేశాల యూజర్ల డేటాను అమెరికాకు బదిలీ చేసినట్టు ఆరోపణ
  • ఈయూ ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్న మెటా
  • న్యాయపరమైన మార్గాల్లో వెళతామని వెల్లడి
Meta fined by DPC

ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్ల మాతృసంస్థ మెటాకు జరిమానాలు కొత్త కాదు. తాజాగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) అనుబంధ సంస్థ ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) మెటాపై రూ.10,766 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. మెటా నిబంధనలను అతిక్రమిస్తూ యూరప్ దేశాల యూజర్ల డేటాను అమెరికాకు బదిలీ చేసినట్టు డీపీసీ ఆరోపించింది. 

యూజర్ల డేటా భద్రత విషయంలో ప్రాథమిక హక్కులను హరించి వేసేలా మెటా వ్యవహరించిందని, యూజర్ల డేటాకు ఉన్న ముప్పును తొలగించడంలో మెటా విఫలమైందని పేర్కొంది. ఈ అంశంలో యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశాలను కూడా మెటా పట్టించుకోలేదని డీపీసీ వెల్లడించింది. ఈ వ్యవహారంలో డీపీసీ గత మూడేళ్లుగా విచారణ జరుపుతోంది. 

కాగా, డీపీసీ తీర్పుపై మెటా స్పందించింది. ఈయూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ వ్యవహారంలో ఈయూ నిర్ణయం సబబు కాదని, ఇతర సంస్థలకు తప్పుడు సందేశం వెళుతుందని మెటా వెల్లడించింది. ఈ వ్యవహారంలో తాము న్యాయపరమైన మార్గాల్లో వెళతామని తెలిపింది.

More Telugu News