Jagan: దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్

  • పేదలకు పంచబోయే భూమిని సమాధులతో చంద్రబాబు పోల్చారన్న జగన్
  • దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లుగా.. పేదలకు ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని వ్యాఖ్య 
  • రాజధాని పేరుతో గేటెడ్ కమ్యూనిటీ కట్టుకోవాలని గజ దొంగల ముఠా అనుకుందని విమర్శ
  • అమరావతిలో 50 వేల మందికి ఇళ్లు నిర్మించాలనుకుంటే అడ్డుపడ్డారని మండిపాటు
  • ఈ నెల 26న ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటన 
cm ys jagan slams chandrababu over poor lands grave comments

రాజధాని పేరుతో గేటెడ్ కమ్యూనిటీ కట్టుకోవాలని చంద్రబాబుతో పాటు గజ దొంగల ముఠా అనుకుందని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లు.. పేదలకు ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని మండిపడ్డారు. ఈ రోజు మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలో 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, ఈ నెల 26న పంపిణీ చేస్తామని ప్రకటించారు. 

పేదలంటే చంద్రబాబుకు ఎంత చులకనో ఆయన మాటల్లోనే పలుమార్లు బయటపడిందన్నారు. ‘‘ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీసీల తోక కత్తిరిస్తా అన్నారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని మహిళల్ని అవమానించారు. ఇంగ్లీష్ మీడియం వద్దని, రకరకాలుగా దుష్ప్రచారం చేశారు’’ అని ఆరోపించారు.

‘‘చంద్రబాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే.. అక్కడ పేదలు కేవలం పాచి పనులు చేయాలంట. కార్మికులుగానే ఉండాలంట. వాళ్లకు అక్కడ ఇళ్లు ఉండకూడదట. అమరావతిలోకి వీళ్లు పొద్దున్నే రావాలట.. పనులు చేసి తిరిగి వెళ్లిపోవాలట. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా ఉందా? ఇలాంటి దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం’’ అని జగన్ చెప్పారు. 

‘‘చంద్రబాబు హయంలో ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇవ్వకపోగా, వైసీపీ ఇస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా కోర్టు కేసులు వేయించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లారు. పెత్తందారీ భావజాలానికి చంద్రబాబు ప్రతీక’’ అని జగన్ ఆరోపించారు.

‘‘అమరావతిలో భూమిని కేటాయించి, 50 వేల మందికి ఇళ్లు కట్టించి ఇస్తుంటే దాన్ని కూడా చులకన చేశారు. ఇళ్ల స్థలాన్ని సమాధి కట్టుకునే స్థలం అని విమర్శించడం ఎంత వరకు సమంజసం? చంద్రబాబుకు మానవత్వం ఉందా?’’ అని నిలదీశారు. పేదల కష్టాల గురించి చంద్రబాబుకు ఏమైనా తెలుసా అని ప్రశ్నించారు. అద్దె ఇంటి బాధలు, ఎలా బతుకుతారో కనీసం తెలుసా అని నిలదీశారు.

‘‘అద్దె ఇళ్లలో ఎవరైనా చనిపోతే శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా తెలీని పరిస్థితిలో నిరుపేదలు ఉంటున్నారు. చంద్రబాబుకు పేదలను ఆదుకోవాలనే ఆలోచన ఏనాడు రాలేదు. పక్షి తన పిల్లలతో కలిసి ఉండాలని కోరుకుంటుంది. సొంత ఇంటిని సమకూర్చుకోలేని స్థితిలో నిరుపేదలు ఉంటే, వారిని కూడా అడ్డుకునే దుర్మార్గం చంద్రబాబుది’’ అని మండిపడ్డారు.

మంచి చేసే చరిత్ర చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు. పేదల వద్దకు వచ్చి, తాము చేసిన మంచి చెప్పి, ఓట్లు వేయమని అడిగే నైతికత లేదన్నారు. తాను మంచి చేశాననే నమ్మకం ప్రజలకు ఉంటే.. తనకు అండగా సైన్యంగా ఉండాలని కోరారు.

More Telugu News