Tiger Global: రాజస్థాన్ రాయల్స్ లో వాటా కొనుగోలుకు విదేశీ సంస్థ ఆసక్తి

Tiger Global in talks to invest in Rajasthan Royals
  • చర్చలు నిర్వహిస్తున్న ప్రైవేటు ఈక్విటీ సంస్థ టైగర్ గ్లోబల్
  • రూ.328 కోట్ల వరకు పెట్టుబడులకు ఆసక్తి
  • డీల్ తుది దశలో ఉన్నట్లు  సమాచారం
ప్రపంచంలో ఖరీదైన క్రీడా లీగ్ లలో ఒకటైన ఐపీఎల్ లో పెట్టుబడులకు అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ ఆసక్తిని చూపిస్తోంది. ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల సంస్థ టైగర్ గ్లోబల్ ఇందుకు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత వాటాదారులతో చర్చలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే టైగర్ గ్లోబల్.. రాజస్థాన్ రాయల్స్ లో 40 మిలియన్ డాలర్లు (సమారు రూ.328 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని అనుకుంటోంది. 650 మిలియన్ డాలర్ల విలువ (రూ.5,330 కోట్లు) ఆధారంగా ఈ మేరకు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నట్టు విస్వసనీయ వర్గాల ఆధారంగా ఎకనమిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. 

ఈ పెట్టుబడుల డీల్ ముగింపు దశలో ఉన్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. టైగర్ గ్లోబల్ కు మనదేశంలో ఎక్కువగా టెక్నాలజీ స్టార్టప్ లలోనే (జొమాటో, డెల్హివరీ, ఫ్లిప్ కార్ట్, ఓలా తదితర) పెట్టుబడులు ఉన్నాయి. మొదటి సారి ఐపీఎల్ పట్ల ఆసక్తి చూపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ లో 60 శాతం మేర వాటాలు బ్రిటన్ కు చెందిన మనోజ్ బండాలే ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ మీడియా చేతిలో ఉన్నాయి. ఈ సంస్థ నుంచి టైగర్ గ్లోబల్ కొంత వాటా కొనుగోలు చేయబోతుందా? అన్నది చూడాల్సి ఉంది. 

రాజస్థాన్ రాయల్స్ తోపాటు ఇతర ఫ్రాంచైజీలతోనూ టైగర్ గ్లోబల్ చర్చలు నిర్వహించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. కానీ రాజస్థాన్ రాయల్స్ తోనే చివరికి ఒప్పందానికి రానుంది. ఆన్ లైన్ ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్ లోనూ టైగర్ గ్లోబల్ కు వాటాలున్నాయి. గుజరాత్ టైటాన్స్ ను యూకేకు చెందిన సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ అనే ప్రైవేటు ఈక్విటీ సంస్థ సొంతం చేసుకోవడం తెలిసిందే. 2022 నాటికి ఐపీఎల్ ఫ్రాంచైజీ (అన్నీ కలిపి) విలువ 10.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కన్సల్టింగ్ సంస్థ డీ అండ్ పీ అడ్వైజరీ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. 2020లో ఉన్న 6.2 బిలియన్ డాలర్లతో పోలిస్తే 75 శాతం పెరగడం గమనార్హం.
Tiger Global
talks
invests
Rajasthan royals
IPL
franchise

More Telugu News