Jagan: బందరుకు పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు.. చిక్కుముళ్లు విప్పడానికి నాలుగేళ్లు పట్టింది: సీఎం జగన్

  • బందరు పోర్టు నిర్మాణానికి ఉన్న గ్రహణాలన్నీ తొలగిపోయాయన్న జగన్
  • 24 నెలల్లోనే నిర్మాణం పూర్తయి మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయని వ్యాఖ్య
  • పోర్టు ఆధారిత పరిశ్రమలతో అనేక ఉద్యోగాలు రానున్నాయని వెల్లడి
CM Jagan Public Meeting at Machilipatnam

బందరుకు పోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. పోర్టు రాకూడదని వేల ఎకరాలను చంద్రబాబు తీసుకున్నారని, పోర్టు రాకపోతే అమరావతికి డిమాండ్ వస్తుందని భావించారని చెప్పారు. ఈ రోజు బందరు పోర్టు నిర్మాణానికి జగన్ భూమి పూజ నిర్వహించారు. తర్వాత మచిలీపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. 

‘‘పోర్టు నిర్మాణంలో ఎదురైన చిక్కుముళ్లు విప్పడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. పోర్టు నిర్మాణానికి ఉన్న గ్రహణాలన్నీ తొలగిపోయాయి. 24 నెలల్లోనే నిర్మాణం పూర్తయి మచిలీపట్నం రూపురేఖలు మారిపోతాయి. పెద్ద పెద్ద ఓడలు బందరు తీరానికి వస్తాయి’’ అని వివరించారు. 

ఒకప్పుడు బందరు ముఖ్య పట్టణమైనా కలెక్టర్‌తో పాటు ఏ ఒక్క అధికారి ఇక్కడ ఉండే వారు కాదని జగన్ చెప్పారు. జిల్లా కేంద్రంలోనే కలెక్టర్‌తో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం ఉండేలా జిల్లాల విభజనతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘‘మేము వచ్చాక రైతుల కల సాకారం చేశాం. రూ.5,516 కోట్లతో పోర్టు పనులు జరుగుతున్నాయి. అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్ క్లియర్ చేశాం. పోర్టు ఆధారిత పరిశ్రమల ద్వారా అనేక ఉద్యోగాలు రానున్నాయి’’ అని చెప్పారు.

More Telugu News