DK Shivakumar: 135 సీట్లతో సంతోషంగా లేనన్న డీకే శివకుమార్.. పార్టీ శ్రేణులకు సరికొత్త టార్గెట్

Iam not happy with 135 seats says DK Shivakumar
  • ఒక్క విజయంతో అలసత్వం వద్దన్న డీకే
  • పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపు
  • అందరం కలసికట్టుగా కష్టపడదామని వ్యాఖ్య

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లతో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి అన్ని బాధ్యతలను తన భుజాలపై వేసుకున్న డీకే... ఎన్నికల ప్రచారాన్ని సైతం అంతా తానై నిర్వహించారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానంటూ సోనియాగాంధీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని... కర్ణాటకను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. 

ఈ క్రమంలో సీఎం పదవిని ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైనప్పటికీ... హైకమాండ్ (సోనియా, రాహుల్) బుజ్జగింపులతో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో, పార్టీకి సమస్యలు ఎదురుకాకుండా ఉండటం కోసం సిద్ధరామయ్యకు సీఎం పదవిని కట్టబెట్టారు. చివరిసారి తనకు సీఎంగా అవకాశం కల్పించాలన్న సిద్ధూ విన్నపాన్ని కూడా హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు బెంగళూరులో పార్టీ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

135 సీట్లతో తాను సంతోషంగా లేనని డీకే చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు మనం ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని... ప్రతి కార్యకర్త ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో కష్టపడాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం మాత్రమేనని చెప్పారు. ఒక్క గెలుపుతో మనం గర్వాన్ని తలకెక్కించుకోకూడదని, అలసత్వానికి గురి కాకూడదని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించడం కోసం అందరం కలసికట్టుగా పని చేద్దామని చెప్పారు. మరోవైపు కర్ణాటకలో 28 లోక్ సభ సీట్లు ఉన్నాయి. మన దేశంలో ఎక్కువ లోక్ సభ స్థానాలు కలిగిన రాష్ట్రాల్లో కర్ణాటక 7వ స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News