Jammu And Kashmir: నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశాలు.. నగరంలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

  • షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు సమావేశం
  • సమావేశానికి హాజరుకానున్న 60 మంది జీ20 దేశాల ప్రతినిధులు
  • శ్రీనగర్‌లో కార్యక్రమం ఏర్పాటును వ్యతిరేకించిన చైనా
  • జీ20 సమావేశానికి దూరంగా టర్కీ
Security tightened in srinagar ahead of g20 tourism working group meeting

జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో నేడు ప్రారంభం కానున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. సమావేశం జరగనున్న షేర్-ఏ-కశ్మీర్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే మార్గాలతో పాటూ నగరం మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. 

2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించిన తరువాత అక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం ఇదే కావడంతో పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలకు జీ20 సభ్య దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సింగపూర్‌ నుంచి అత్యధికంగా హాజరవుతారని అధికారులు తెలిపారు. 

మరోపక్క, జమ్మూలో ఈ సమావేశాలను నిర్వహించడంపై చైనా ఇప్పటికే అభ్యంతరం చెప్పగా, సౌదీ అరేబియా ఇప్పటివరకూ సమావేశంలో పాల్గొనడంపై ఎటూ తేల్చలేదు. ఈ సమావేశానికి దూరంగానే ఉండాలని టర్కీ (తుర్కియా) నిర్ణయించింది. ఇక, అంతర్జాతీయ సమావేశాలను వివాదాస్పద ప్రాంతాల్లో నిర్వహించకూడదన్న చైనా వ్యాఖ్యలపై భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. తమ భూభాగంలో ఎక్కడైనా సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు తమకుందని తేల్చి చెప్పింది.

More Telugu News