Mumbai Indians: సన్ రైజర్స్ పై భారీ విజయంతో ప్లే ఆఫ్ రేసులో నిలిచిన ముంబయి

  • ప్లే ఆఫ్ బెర్తు కోసం ముంబయి ఆరాటం
  • సన్ రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో గెలుపు
  • 201 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే కొట్టేసిన ముంబయి
  • కామెరాన్ గ్రీన్ మెరుపు సెంచరీ
MI beat SRH to make play off chances lively

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జూలు విదిల్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని మరో 2 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. 18 ఓవర్లలో 2 వికెట్లకు 201 పరుగులు చేసి జయభేరి మోగించింది. 

ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ మెరుపు సెంచరీ సాధించడం ఈ ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది. సన్ రైజర్స్ బౌలర్లను చితకబాదిన గ్రీన్ 47 బంతుల్లోనే 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గ్రీన్ 8 ఫోర్లు, 8 సిక్సులు కొట్టడం విశేషం.

కెప్టెన్ రోహిత్ శర్మ 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ తో 56 పరుగులు చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 14 పరుగులకే వెనుదిరగ్గా... గ్రీన్, రోహిత్ శర్మ జోడీ రెండో వికెట్ కు 128 పరుగులు జోడించింది. వీరిద్దరి దూకుడుతో సన్ రైజర్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 

రోహిత్ శర్మ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ వచ్చీరావడంతోనే ఫోర్ కొట్టి ఉతుకుడు కార్యక్రమం షురూ చేశాడు. సూర్యకుమార్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, మయాంక్ అగర్వాల్ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ విజయం అనంతరం ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. ముంబయి ఖాతాలో ప్రస్తుతం 16 పాయింట్లు ఉన్నాయి. ఇవాళ సన్ రైజర్స్ పై భారీ విజయం సాధించినప్పటికీ ముంబయి రన్ రేట్ (-0.044) మైనస్ లోనే ఉంది. కాసేపట్లో బెంగళూరులో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుండగా, ఆ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే... నెట్ రేట్ ఆధారంగా ఆర్సీబీ జట్టే ఆఫ్ బెర్తును కైవసం చేసుకుంటుంది. 

అయితే, బెంగళూరులో భారీ వర్షం కురవడంతో చిన్నస్వామి స్టేడియం తడిసిముద్దయింది. మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షం తగ్గడంతో మైదానాన్ని ఆటకు సిద్ధం చేసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మ్యాచ్ ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ ను 18 ఓవర్ల చొప్పున నిర్వహిస్తారని తెలుస్తోంది.

More Telugu News