SRH: అదరగొట్టిన సన్ రైజర్స్ ఓపెనర్లు... ముంబయి ముందు భారీ టార్గెట్

  • సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసిన సన్ రైజర్స్
  • అర్ధసెంచరీలు సాధించిన మయాంక్, వివ్రాంత్
SRH openers batting show put huge target for MI

ఐపీఎల్ తాజా సీజన్ లో దారుణ ఓటములు చవిచూసి ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ముంబయి ఇండియన్స్ పై భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ దుమ్మురేపడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. 

ఈ టోర్నీలో చాలా లేటుగా ఫాంలోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్ లో చిచ్చరపిడుగులా ఆడాడు. మయాంక్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ వివ్రాంత్ శర్మ తానేమీ తక్కువ తినలేదన్నట్టు దూకుడు ప్రదర్శించాడు. వివ్రాంత్ 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 69 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 140 పరుగులు జోడించి శుభారంభం అందించారు.

అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. దాంతో మరింత భారీ స్కోరు చేసే అవకాశాన్ని సన్ రైజర్స్ చేజార్చుకుంది. గత మ్యాచ్ సెంచరీ హీరో హెన్రిచ్ క్లాసెన్ ఈసారి 18 పరుగులకే వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ 1 పరుగు చేయగా, ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్ ఆడిన తొలి బంతికే డకౌట్ అయ్యాడు. కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ 13, సన్వీర్ సింగ్ 4 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 

ముంబయి ఇండియన్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. సన్ రైజర్స్ కోల్పోయిన 5 వికెట్లలో 4 వికెట్లు మధ్వాల్ ఖాతాలోకే చేరాయి. మధ్వాల్ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. క్రిస్ జోర్డాన్ 1 వికెట్ పడగొట్టాడు.

More Telugu News