Chandrababu: ఎన్టీఆర్... తెలుగు జాతి ఆస్తి: చంద్రబాబు

  • హైదరాబాదులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
  • కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో కార్యక్రమం
  • హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు
  • ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు మహాశక్తి అని వెల్లడి
Chandrababu says NTR is the asset of Telugu people

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాదులో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమానికి హాజరయ్యారు. కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. ఎన్టీఆర్ ఆయన కుటుంబానికే సొంతం కాదని, ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. 

ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28వ తేదీని అమెరికాలో 'తెలుగు హెరిటేజ్ డే'గా ప్రకటించారని, తెలుగు జాతికి ఎన్టీఆర్ తీసుకువచ్చిన గుర్తింపుకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని అన్నారు. 

"ఎన్టీఆర్ కూడా మొదట మామూలు వ్యక్తే. ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. ఎంతో కష్టపడి విద్యాభ్యాసం చేశారు. ప్రతి రోజు తల్లి పాలు పితికి ఇస్తే వాటిని టీ దుకాణాలకు పోసి వచ్చేవారు. ఆ తర్వాత విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి చదువుకుని సాయంత్రానికి తిరిగి వచ్చి మళ్లీ పనులు చేసుకునేవారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో ఆయనకు రిజిస్ట్రార్ ఉద్యోగం వచ్చింది. అయితే లంచాలు తీసుకోవడం నచ్చక ఆ ఉద్యోగం వదిలేసి సినిమాల్లో నటించేందుకు మద్రాస్ వెళ్లారు.

ఒక శ్రీకృష్ణుడిగా, ఒక వెంకటేశ్వరస్వామిగా, ఇతర పాత్రలను కూడా భవిష్యత్తులో మరెవ్వరూ చేయలేనంత ప్రతిభావంతంగా నటించారు. ఎన్టీఆర్ మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి. రాయలసీమలో కరవు వస్తే జోలె పట్టి విరాళాలు సేకరించారు. చైనా యుద్ధం, దివి సీమ ఉప్పెన సమయంలోనూ రాష్ట్రమంతా తిరిగి జోలెపట్టి విరాళాలు సేకరించారు. తనను 40 ఏళ్ల పాటు ఆదరించిన ప్రజల కోసం రాజకీయ పార్టీ పెట్టాడు. ఇవాళ దేశంలో అమలవుతున్న అనేక సంస్కరణలకు ఆద్యుడిగా ఎన్టీఆర్ నిలిచిపోతారు" అని వివరించారు. 

ఎన్టీఆర్ జీవితచరిత్రను ఐదు నిమిషాల పాటు మనసులో స్మరించి మీరు ఏ సంకల్పం అయినా చేయండి... ఆ సంకల్పం జయప్రదం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ అనేవి కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదని, ఓ మహాశక్తి అని అభివర్ణించారు.

More Telugu News