Balakrishna: ఎన్టీఆర్ పథకాలు నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి: బాలకృష్ణ

  • హైదరాబాదులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • హాజరైన నందమూరి బాలకృష్ణ
  • తెలుగు ఖ్యాతిని ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తం చేశారని వెల్లడి
  • ఎన్టీఆర్ అంటే నూతన శకానికి ఆరంభం అని వివరణ
Balakrsihna speech in NTR Centenary Celebrations

హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. ఎన్టీఆర్ కారణజన్ముడు, మహానుభావుడు అని అభివర్ణించారు. నేను తెలుగువాడ్ని అని పౌరుషంతో, దమ్ము, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చెప్పుకోగలిగేలా చేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని కొనియాడారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని కీర్తించారు. 

ఎన్టీఆర్ అంటే నూతన శకానికి అరంభం అని అభివర్ణించారు. ప్రజల మనస్సుల్లో ఎన్టీఆర్ శాశ్వత స్థానం పొందారని, నటనలో అనేక ప్రయోగాలు చేశారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్నో సాహసోపేతమైన పాత్రలను అద్భుతంగా పోషించారని తెలిపారు. 

నాడు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని వెల్లడించారు. దేశంలో తొలిసారిగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారని గుర్తు చేశారు. ఇవాళ అందరం ఆహార భద్రత గురించి మాట్లాడుకుంటున్నామని, కానీ ఎన్టీఆర్ ఆనాడే 1.20 కోట్ల మందికి కిలో బియ్యం రూ.2కే ఇచ్చారని బాలయ్య వివరించారు. 

రైతులకు భూమి శిస్తు రద్దు చేశారని తెలిపారు. పటేల్, పట్వారీ వ్యవస్థలు రద్దు చేయడం ద్వారా సామాజిక సంస్కరణలకు కృషి చేశారని వెల్లడించారు. నాడు 300 పైచిలుకు తాలూకాలను 1000కి పైగా మండలాలుగా విభజించి ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చిన గొప్ప దార్శనికుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కీర్తించారు.

More Telugu News