Chandrababu: తప్పు చేయాల్సి వస్తే రోడ్డు మీద ఉరి వేసుకుంటాం: గుడివాడ అమర్నాథ్

  • విస్సన్నపేటలో సెంటు భూమి తమ పేరు మీదున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న అమర్నాథ్
  • నిరూపించకపోతే లోకేశ్ ను రాజకీయాల నుంచి తప్పిస్తారా? అంటూ సవాల్ 
  • విశాఖపట్నంపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్న
  • ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే.. చంద్రబాబు భోగాలు అనుభవిస్తారని విమర్శ 
ap minister gudivada amarnath challenge to tdp chief chandrababu naidu

తాము తప్పు చేయాల్సి వస్తే రోడ్డు మీద ఉరి వేసుకుంటామని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విస్సన్నపేట గ్రామంలో 609 ఎకరాల భూమిని కాజేసినట్టుగా చంద్రబాబు చేసిన విమర్శలపై మండిపడ్డారు. 609 ఎకరాల్లో ఒక సెంటు భూమి అమర్నాథ్ పేరు మీద కానీ, తన కుటుంబ సభ్యుల పేరిట కానీ ఉన్నా.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు నిరూపించకపోతే లోకేశ్ ను రాజకీయాలు నుంచి తప్పిస్తారా? అంటూ సవాల్ విసిరారు.

‘‘మీరు చెప్పిన మాటలు ప్రజలు నమ్మరు. మీ కొడుకులాగా సందులో నుంచి రాజకీయాల్లోకి రాలేదు’’ అని చంద్రబాబుపై అమర్నాథ్ విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఘగర్ ఫ్యాక్టరీలను మూయించింది ఎవరని ప్రశ్నించారు. ఘగర్ ఫ్యాక్టరీలు గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

‘‘చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలపై కోపం ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మంచి జరగకూడదని చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు’’ అని ఆరోపించారు. విశాఖపట్నంపై చంద్రబాబు ఎందుకు విషం చిమ్ముతున్నారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగాలు చేస్తే.. చంద్రబాబు భోగాలు అనుభవిస్తారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ 90 శాతం విజయం సాధించిందని గుర్తు చేశారు. 

ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, కానీ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం చేశారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల పేరుతో మరో కొత్త డ్రామాకు తెరతీశారు. చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు’’ అని అమర్నాథ్ విమర్శలు చేశారు.

More Telugu News