USA: ఒబామా సహా 500 మంది అమెరికన్లపై నిషేధం విధించిన రష్యా

  • వారిని తమ దేశంలోకి రానివ్వబోమని ప్రకటన
  • తమ దేశంపై అగ్రరాజ్యం ఆంక్షలపై ప్రతి చర్యగా నిర్ణయం
  • ఉక్రెయిన్‌ పై దాడి చేస్తున్న రష్యాను ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా
Barack Obama Among 500 Americans Banned From Russia After US Sanctions

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై యూరప్ దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మొదటి నుంచి దన్నుగా నిలుస్తున్న అగ్రరాజ్యం అమెరికా అనేక ఆంక్షలతో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి ప్రతిస్పందనగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా 500 మంది అమెరికన్లకు తమ దేశంలో ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు రష్యా తెలిపింది. 

‘మాపై జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా క్రమం తప్పకుండా విధించే రష్యా వ్యతిరేక ఆంక్షలకు ప్రతిస్పందనగా 500 మంది అమెరికన్లకు రష్యన్ ఫెడరేషన్‌లోకి ప్రవేశం నిషేధించాం’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యా ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నాలను విస్తృతం చేయడంతోపాటు ఆ దేశానికి వందలాది కంపెనీలు, వ్యక్తులను అమెరికా తన ఆంక్షల బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. 

ప్రతిగా రష్యా సైతం చర్యలు తీసుకుంటోంది. ‘రష్యాకు వ్యతిరేకంగా శత్రు దేశాలు వేసే ప్రతీ చర్యకు కచ్చితంగా ప్రతిచర్య ఇవ్వకుండా ఉండదని అమెరికా చాలా కాలం క్రితమే నేర్చుకుని ఉండాల్సింది’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తమ నిషేధిత జాబితాలో ఒబామాతో పాటు ప్రముఖ టెలివిజన్ హోస్ట్‌లు స్టీఫెన్ కోల్‌బర్ట్, జిమ్మీ కిమ్మెల్, సేథ్ మేయర్స్ కూడా ఉన్నారు. సీఎన్ఎన్ యాంకర్ ఎరిన్ బర్నెట్, ఎంఎస్ఎన్బీసీ ప్రెజెంటర్లు రాచెల్ మాడో, జో స్కార్‌బరోను కూడా చేర్చారు. 

తమ నిషేధిత జాబితాలో ఉన్న అమెరికా  సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, మరికొందరు పెద్దలు రష్యా వైఖరులను దెబ్బతీసే, అసత్యాలను వ్యాప్తి చేయడంలో పాలు పంచుకున్నారని రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేసే కంపెనీల అధిపతులను బ్లాక్ లిస్ట్ చేసినట్లు రష్యా తెలిపింది.

More Telugu News