Thieves: తిరుపతి- గుంటూరు ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల అరాచకం

  • శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీ
  • కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • కిటికీల పక్కన ఉన్న మహిళా ప్రయాణికులే లక్ష్యం
Thieves strike Tirupati Guntur express target women passengers

తిరుపతి నుంచి గుంటూరు వెళుతున్న రైలులో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు అరాచకం సృష్టించారు. పలు బోగీల్లో కిటికీల పక్కన ఉన్న మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు ఆభరణాలను తెంపుకుపోయారు. తిరుపతి-గుంటూరు ఎక్స్ ప్రెస్ కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రాత్రి 11.30 గంటల సమయంలో, ఎర్రగుడిపాడు రైల్వే స్టేషన్ సమీపంలో ఇది చోటు చేసుకుంది. ఒక్కసారిగా రైలు ఆగగా, ఆ వెంటనే సుమారు 20 నుంచి 25 మంది దొంగలు ఎస్1 నుంచి ఎస్6 వరకుు బోగీల్లోని మహిళా ప్రయాణికులను లక్ష్యం చేసుకున్నారు. 

పలువురు ప్రతిఘటించినప్పటికీ దొంగలు దాడులకు దిగినట్టు తెలుస్తోంది. ఎంత మేర బంగారం దోపిడీకి గురైందన్న సమాచారం తెలియలేదు. ఈ దోపిడీపై ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఈ రైలుకు ఎర్రగుంట్ల నుంచి గుంటూరు వరకు భద్రత ఉంటుంది. దీంతో ఎర్రగుంట్ల రావడానికి ముందే దొంగలు దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News