Karnataka: నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం

Siddaramaiah To Take Oath As Karnataka Chief Minister Today
  • బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పూర్తయిన ఏర్పాట్లు
  • ఉప ముఖ్యమంత్రిగా డీకే, మరో 8 మంది మంత్రుల ప్రమాణం
  • ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల రాక..
  • నాన్ బీజేపీ సీఎంలకూ ఆహ్వానం పంపిన కాంగ్రెస్ పార్టీ
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరులోని కంఠీరవ స్టేడియాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ మధ్యాహ్నం 12:30 గంటలకు సిద్ధరామయ్యతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయిస్తారు. కాగా, 2013లో ఇదే వేదికపై సిద్ధరామయ్య తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

సిద్ధరామయ్యతో పాటు ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్, మంత్రులుగా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రతిపక్షాల బలప్రదర్శనగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. దేశంలో బీజేపీయేతర ముఖ్యమంత్రులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులతో పాటు కీలక నేతలు సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా ఢిల్లీలోని కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


Karnataka
Siddaramaiah
Bengaluru
oath taking
DKS

More Telugu News