Toor Dal: దేశంలో కందిపప్పు కొరత.. కొండెక్కిన ధర

Toor Dal rates hiked no stock boards in markets
  • నిన్నమొన్నటి వరకు నూనెల ధరలతో అల్లాడిన సామాన్యులు
  • దుకాణాల్లో దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు
  • ఉన్న స్టాకును అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు
  • ప్రస్తుతం కిలో కందిపప్పును రూ. 140కి విక్రయిస్తున్న వైనం

వంటనూనెల ధరలు అమాంతం పెరగడంతో నిన్నమొన్నటి వరకు అల్లాడిపోయిన సామాన్యులు కుదుటపడుతున్న వేళ.. ఇప్పుడు కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కాస్తోకూస్తో ఉన్న కందిపప్పును అధిక ధరలకు అమ్ముకుంటూ వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. 

రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం రూ. 140కి పెరిగిన ధర రూ.180 వరకు చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. వేసవిలో కందిపప్పు వినియోగం కొంత తక్కువగా ఉంటుందని, వచ్చేది వర్షాకాలం కావడంతో పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో డిమాండుకు సరిపడా సరఫరా లేకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.  రెండు నెలల క్రితం వరకు హోల్‌సేల్ మార్కెట్లో రూ. 100 నుంచి రూ. 103 వరకు ఉన్న కందిపప్పు ఇప్పుడు రిటైల్ మార్కెట్లో రూ. 140 వరకు పలుకుతోంది.  

గతేడాది దేశంలో 43.4 లక్షల టన్నుల కందిపప్పును పండించగా, మరో 15 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. అయితే, ఈ ఏడాది మాత్రం దిగుబడి 38.9 లక్షల టన్నులు దాటలేదు. దీనికి తోడు దిగుమతి విషయంలోనూ కేంద్రం అలసత్వం చేసిందన్న ఆరోపణలున్నాయి. కాగా, క్వింటాల్ కందిపప్పుకు కేంద్రం 6,600 కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ ప్రస్తుతం క్వింటాల్ కందిపప్పు రూ. 10 నుంచి రూ. 12 వేలు పలుకుతోంది.

  • Loading...

More Telugu News