Ravi Shastri: వీళ్లను వరల్డ్ కప్ కోసం టీమిండియాలోకి తీసుకోవచ్చు: రవిశాస్త్రి

  • ఐపీఎల్ లో అదరగొడుతున్న కుర్రాళ్లు
  • విశేషంగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్, రింకూ సింగ్
  • ఆకట్టుకుంటున్న తిలక్ వర్మ, సాయి సుదర్శన్, జితేశ్, రుతురాజ్
  • వీళ్లు టీమిండియాకు ఆడడమే తరువాయి అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యలు
Ravi Shastri lauds youngsters who shown their talent in a grand way

ఐపీఎల్ తాజా సీజన్ లో కొందరు కుర్రాళ్లు తమ ఆటతీరుతో తనను విశేషంగా ఆకట్టుకున్నారని క్రికెట్ దిగ్గజం, వ్యాఖ్యాత రవిశాస్త్రి పేర్కొన్నారు. వారు ఈ ఏడాది భారత్ లో జరిగే వరల్డ్ కప్ కు టీమిండియాలో చోటు దక్కించుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు యశస్వి జైస్వాల్, కోల్ కతా నైట్ రైడర్స్ హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ లపై రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. 

"జైస్వాల్ ఈ సీజన్ లో ప్రదర్శిస్తున్న ఆటతీరుకు గతేడాది ఆడిన ఆటకు ఏమాత్రం పోలికలేదు. అతడు కిందటేడాది కంటే ఎంతో మెరుగయ్యాడు. ఈ స్థాయిలో తనను తాను మార్చుకోవడం అత్యంత సానుకూలాంశం. అతడు కొట్టే షాట్ల వెనుక ఉన్న బలం అతడు ఎంత అభివృద్ధి చెందాడో చాటుతోంది. 

ఇక రింకూ సింగ్ గురించి చెప్పాలంటే అతడి టెంపర్ మెంట్ అమోఘం. ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడు. జైస్వాల్, రింకూ అత్యంత కఠిన నేపథ్యాల నుంచి వచ్చినవారే. ఆట కోసం వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. వారికి ఏదీ సులభంగా లభించలేదు" అని వివరించారు. 

ఈ సందర్భంగా రవిశాస్త్రి... తెలుగుతేజం తిలక్ వర్మ, పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్ ల ఆటతీరును కూడా ప్రస్తావించారు. వీళ్లందరూ ఫామ్ లో ఉంటే వరల్డ్ కప్ లో ఆడే టీమిండియాకు ఎంపికయ్యేందుకు అర్హులేనని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో ఎవరైనా గాయపడితే మరో ఆలోచన లేకుండా ఈ యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చని తెలిపారు.

More Telugu News