Virat Kohli: ఇప్పటికే చాలా ఒత్తిడికి లోనయ్యా.. ఇక విమర్శలను పట్టించుకోను: విరాట్ కోహ్లీ

  • సన్ రైజర్స్ తో మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన కోహ్లీ
  • ఇది తన ఆరో ఐపీఎల్‌ శతకమని వెల్లడి
  • ఒత్తిడిలో ఉండటం వల్ల తనకు తాను తగినంత క్రెడిట్‌ ఇచ్చుకోలేకపోతున్నానని వ్యాఖ్య
  • మరో సెంచరీ చేస్తే ఐపీఎల్ లో అరుదైన రికార్డును అందుకోనున్న విరాట్ 
 i dont care what anyone on the outside says because that is their opinion says virat kohli

గురువారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. టార్గెట్ చేజింగ్ లో బరిలోకి దిగి, సెంచరీ కొట్టి విజయానికి బాటలు వేశాడు. దీంతో సన్‌రైజర్స్‌ పై రాయల్‌ చాలెంజర్స్‌ అద్భుత విజయం సాధించింది.

మ్యాచ్‌ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశాడు. ‘‘నేను గత గణాంకాలను పట్టించుకోను. ఇప్పటికే చాలా ఒత్తిడికి లోనయ్యాను. ఇది నా ఆరో ఐపీఎల్‌ శతకం. నేను ఒత్తిడిలో ఉన్నందున కొన్ని సార్లు నాకు నేను తగినంత క్రెడిట్‌ ఇచ్చుకోలేకపోతున్నా. అదేవిధంగా బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోను. అది వారి అభిప్రాయం అంతే’’ అని స్పష్టం చేశాడు.

‘‘పాయింట్ల పట్టికలో స్థానం, ఆట పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే ఇది (సెంచరీ) చాలా ప్రత్యేకమైనది. హైదరాబాద్‌కు చాలా మంచి స్కోరు వచ్చిందని నేను అనుకున్నా. ఓపెనింగ్ బాగుండాలని మేం కోరుకున్నాం.. కానీ ఫస్ట్ వికెట్ కు 172 పరుగులు జోడిస్తామని ఊహించలేదు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వేరే లెవల్ లో ఆడుతున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు.

హైదరాబాద్ లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యఛేదనలో ఆర్‌సీబీ మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. విరాట్‌ కోహ్లీ (63 బంతుల్లో 100, 12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సూపర్‌ సెంచరీ చేయగా, కెప్టెన్‌ డుప్లెసిస్‌ (71) ఆకట్టుకున్నాడు. 

ఇక ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది ఆరో సెంచరీ. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ సరసన చేరాడు. గేల్ 142 మ్యాచుల్లో ఆరు శతకాలు నమోదు చేయగా, కోహ్లీ 236వ మ్యాచ్‌లో ఈ ఘనత అందుకుని రికార్డు కెక్కాడు. కోహ్లీ, గేల్‌ తర్వాత జాస్‌ బట్లర్‌ ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన క్రికెటర్‌గా చరిత్రకెక్కనున్నాడు.

More Telugu News