Telangana: వాషింగ్టన్ డీసీలో మంత్రి కేటీఆర్ రౌండ్ టేబుల్

Minister KTR led the Aerospace and Defense Roundtable in Washington DC
  • ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ విషయంలో అక్కడి వ్యాపారవేత్తలు, ప్రతినిధులతో చర్చ
  • తెలంగాణలో అవకాశాలను వివరించిన కేటీఆర్
  • రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరిన మంత్రి 
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వాషింగ్టన్ లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్ టేబుల్‌కు నేతృత్వం వహించారు. ఈ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, సలహా, స్టార్టప్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏరోస్పేస్ రంగం, ప్రైవేట్ రంగ రక్షణ పెట్టుబడులు అద్భుతమైన వృద్ధిని వారికి వివరించారు. అమెరికా ఏరోస్పేస్, డిఫెన్స్ కార్పొరేషన్లు భారత్ లో పెట్టుబడి పెట్టేందుకు హైదరాబాద్‌ అత్యుత్తమ గమ్యస్థానంగా పేర్కొన్నారు. తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ ఎంతో భవిష్యత్ ఉన్న రంగం అని అన్నారు. విప్లవాత్మక పారిశ్రామిక విధానం అయిన టీఎస్ఐపాస్ గురించి మంత్రి హైలైట్ చేశారు.

 స్వీయ-ధ్రువీకరణల ఆధారంగా నిర్ణీత సమయంలో ఆన్‌లైన్ లో, పారదర్శక అనుమతులను మంజూరు చేయడం ద్వారా పరిశ్రమల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఇది ఎలా సహాయపడిందో వివరించారు. 2018, 2020, 2022లో వరుసగా మూడు సంవత్సరాల్లో ఏరోస్పేస్‌లో భారత్ లో ఉత్తమ రాష్ట్ర అవార్డులను గెలుచుకోవడం ద్వారా తెలంగాణ ఒక అద్భుతమైన ఘనత సాధించిందని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాస్ట్ ఎఫెక్టివ్‌లో ఏరోస్పేస్ సిటీ ఆఫ్ ఫ్యూచర్ లో హైదరాబాద్ నంబర్ 1 స్థానంలో నిలిచిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘనతలు ఏరోస్పేస్ రంగం పట్ల రాష్ట్ర ప్రగతిశీల దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ వారిని కోరారు.
Telangana
KTR
Washington DC

More Telugu News