Virat Kohli: ఉప్పల్ లో కోహ్లీ 'వంద'నం... సొంతగడ్డపై సన్ రైజర్స్ కు పరాభవం

  • సెంచరీతో విశ్వరూపం ప్రదర్శించిన కోహ్లీ
  • 63 బంతుల్లో 100 పరుగులు
  • 8 వికెట్ల తేడాతో నెగ్గిన ఆర్సీబీ
  • మొదట 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 రన్స్ చేసిన సన్ రైజర్స్
  • 19.2 ఓవర్లలో 2 వికెట్లకు కొట్టేసిన ఆర్సీబీ
Kohli steers RCB to victory over SRH

డాషింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గట్టు ఆడితే ఎలా ఉంటుందో ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు కళ్లారా చూశారు. కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి అద్భుతమైన రీతిలో సెంచరీ చేసిన వేళ... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై నెగ్గింది.

సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడనే చెప్పాలి. 187 పరుగుల లక్ష్యఛేదనలో ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా కోహ్లీ పరుగుల వెల్లువ సృష్టించాడు. కోహ్లీ 63 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి భువీ బౌలింగ్ లో అవుటయ్యాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. 

మరో ఎండ్ లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ సునాయాసంగా నెగ్గింది. డుప్లెసిస్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులు చేశాడు. చివర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక రివర్స్ స్కూప్ తో బౌండరీ సాధించడంతో ఆర్సీబీ గెలుపు ముంగిట నిలిచింది. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 3 పరుగులు అవసరం కాగా... కార్తీక్ త్యాగి బౌలింగ్ లో ఈజీగా పరుగులు చేసిన ఆర్సీబీ విజయభేరి మోగించింది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 1, నటరాజన్ 1 వికెట్ తీశారు. సెంచరీ హీరో కోహ్లీ, డుప్లెసిస్ తొలి వికెట్ కు 172 పరుగులు జోడించడంతోనే సన్ రైజర్స్ పరాజయం ఖాయమైంది. కాగా, కోహ్లీకి ఇది ఐపీఎల్ లో ఆరో సెంచరీ కావడం విశేషం.

More Telugu News