DK Shivakumar: పవర్ షేరింగ్ ఫార్ములాను నేను బయటకు చెప్పను!: డీకే శివకుమార్

  • దీనికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు ఏదో ఒక సమయంలో సమాధానం ఇస్తారన్న డీకే 
  • ప్రస్తుతం బాధపడటం లేదు.. ప్రయాణం ఇంకా మిగిలి ఉందని వ్యాఖ్య
  • డీప్యూటీ సీఎం పదవి అంగీకరించడంపై పూర్తి సంతోషంగా లేనని డీకే సోదరుడి వ్యాఖ్య
DK Shivakumar on Karnataka power sharing formula

కర్ణాటకకు సంబంధించి తమ పార్టీ అధిష్ఠానం, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రూపొందించిన పవర్ షేరింగ్ ఫార్ములాను తాను వెల్లడించలేనని కర్ణాటక కాబోయే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం అన్నారు. కర్ణాటకలో పార్టీ అధికార భాగస్వామ్య ఫార్ములాపై డీకే శివకుమార్ ఇండియా టుడేతో మాట్లాడారు. తామంతా కలిసి జరిపిన చర్చలను తాను బహిర్గతం చేయదలచుకోలేదని, ఏదో ఒక సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు దీనికి సమాధానం ఇస్తారని స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం బాధపడటం లేదని, ప్రయాణం ఇంకా మిగిలి ఉందని కూడా వ్యాఖ్యానించారు.

మే 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అవుతారు. వీరిద్దరు కూడా సీఎం పోస్ట్  కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీ నివేదిక ప్రకారం అధికార భాగస్వామ్య ఫార్ములాతో వచ్చిన తర్వాత శివకుమార్ కాస్త వెనక్కి తగ్గారు. పవర్ షేరింగ్ ఫార్ములా కారణంగా శివకుమర్ మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. రెండేళ్లు సిద్ధూ, ఆ తర్వాత మూడేళ్లు డీకే ముఖ్యమంత్రిగా ఉండేలా అధిష్ఠానం ఒప్పించిందని వార్తలు వచ్చాయి. దీనిపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

ఇదిలా ఉండగా, డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించడం పట్ల తాను సంతోషంగా లేనని డీకే శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ అన్నారు. తాను పూర్తిగా సంతోషంగా లేనని, కానీ కర్ణాటక ప్రయోజనాల దృష్ట్యా మేము మా కమిట్‌మెంట్‌ను నెరవేర్చాలని భావిస్తున్నామని, అందుకే తన సోదరుడు ఉప ముఖ్యమంత్రి పోస్టుకు అంగీకరించవలసి వచ్చిందని అన్నారు. భవిష్యత్తులో మనం చూస్తామని, చాలా దూరం వెళ్లాలని, తన సోదరుడికి సీఎం పదవి కావాలని కోరుకుంటున్నానని, ఇప్పుడైతే అది జరగలేదని, ముందు ముందు చూస్తామన్నారు.

More Telugu News