Chandrababu: టిడ్కో ఇళ్లు మీ ఆస్తి... ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు: చంద్రబాబు

  • విశాఖలో చంద్రబాబు పర్యటన
  • పెందుర్తిలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులతో సమావేశం
  • టీడీపీ అన్ని సౌకర్యాలతో ఇళ్లు కట్టించిందన్న లబ్దిదారులు
  • సైకో సీఎం వచ్చి మంచి ఇళ్లు చెడగొట్టాడన్న చంద్రబాబు
  • నాలుగేళ్లలో 5 ఇళ్లు మాత్రమే కట్టాడని విమర్శలు
Chandrababu met TIDCO houses beneficiaries in Pendurti

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ పర్యటనలో భాగంగా పెందుర్తిలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులతో సమావేశం అయ్యారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో సకల వసతులతో నిర్మించిన ఇళ్లను ఇప్పటికీ తమకు కేటాయించకపోవడంపై లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. 

"1983లో ఎన్టీ రామారావు పక్కా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఆయన స్ఫూర్తిగా పేదవాడి సొంతింటి కల నిజం చేయాలనేదే నా లక్ష్యం. భారత కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించాను. నీరు, రోడ్లు, కరెంటు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాం. 

300, 365,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాం. నాడు 7.50 లక్షల ఇళ్లు పేదలకు మంజూరు చేశాం. మొత్తం ఇళ్ల నిర్మాణంపై 30 వేల కోట్లు ఖర్చు చేశాం. మంజూరు అయిన టిడ్కో ఇళ్లలో 3.15 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని నాడే చెప్పాం. 40 నుంచి 60 అడుగుల రోడ్లతో టిడ్కో ఇళ్ల ప్రాంగణాలు డిజైన్ చేశాం. 

ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక సెంటు స్థలం ఇస్తామంటున్నారు. 12 అడుగుల రోడ్డు మాత్రమే జగన్ చెప్పిన కాలనీల్లో రోడ్డు వస్తుంది. ఈ రోడ్డుపై రెండు వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. 

టిడ్కో కాలనీల్లో సిమెంటు రోడ్లు వేశాం. పార్కులు కట్టాం. డ్రైనేజి, అంగన్ వాడి సెంటర్ లు ఏర్పాటు చేశాం. ఆస్తి విలువ పెంచాలని చూశాం. గ్రానైట్ రాళ్లతో కిచెన్, వాష్ ఏరియా, ట్యాప్ లు ఉండేలా వసతులు కల్పించాం. మీ ఇంటికి ఏ రంగు వేసుకుంటారో అది మీ ఇష్టానికే వదిలేశాం. 

మనం కట్టిన ఇళ్లకు రంగులు వేసుకుని జగన్ దిష్టిబొమ్మల్లా పెట్టాడు. ఆనాడు రూ.లక్షా 50 వేలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చాం. కేంద్రం రూ.లక్షా 50 వేలు ఇచ్చింది. ఈ రూ.3 లక్షలు కాకుండా సాధారణ మౌలిక సదుపాయాలకు నిధులు ఇచ్చాం. పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్లు పెట్టాం. 

ఈ సైకో సీఎం వచ్చి  మంచి ఇళ్లు  చెడగొట్టాడు. వన్ టైమ్ సెటిల్ మెంట్ అని దానికి కూడా డబ్బులు కట్టించుకున్నాడు. టిడ్కో ఇళ్లు మీ ఆస్తి... వదలి పెట్టొద్దు. ఐదేళ్లు గడుస్తున్నా ఒక్క ఇంటికి కూడా ప్రణాళిక తయారు చేయలేకపోయాడు. నాలుగేళ్లలో 5 ఇళ్లు కట్టాడు. 

జగన్ ఉండే ఇంటిలోనేమో వంద గదులు ఉండాలి. ఊరికో ప్యాలెస్ కావాలి.  పేదవారికి మంచి ఇల్లు ఉండకూడదా?" అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News