jallikattu: జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు!

  • జల్లికట్టు ఆడేందుకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థించిన సుప్రీం
  • ఈ ఆట జంతు హింస చట్టం కిందికి రాదని వెల్లడి
  • గతంలో ఇచ్చిన తీర్పును సవరించిన ధర్మాసనం
sc upholds validity of tamil nadu law allowing bull taming sport jallikattu

తమిళనాడు సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జల్లికట్టు ఆడేందుకు వీలుగా తమిళనాడు ప్రభుత్వం చేసిన చట్టాన్ని సమర్థించింది. జల్లికట్టు పోటీలపై ఎలాంటి నిషేధం లేదని చెప్పింది.

2014లో జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సవరించింది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదని కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టు అనేది తమిళనాడు సాంస్కృతిక వారసత్వంలో భాగమని అసెంబ్లీ ప్రకటించినప్పుడు.. అందుకు భిన్నమైన అభిప్రాయాన్ని న్యాయవ్యవస్థ వ్యక్తం చేయబోదని వ్యాఖ్యానించింది. 

ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో జల్లికట్టు క్రీడను నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు 2014లో జల్లికట్టును నిషేధించగా.. తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దీంతో జంతు హింస చట్టం పరిధి నుంచి జల్లికట్టుకు తొలగిస్తూ కేంద్రం 2016లో నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి అనుగుణంగా జల్లికట్టుకు అనుకూలంగా జంతు హింస చట్టానికి సవరణలు చేస్తూ 2017లో తమిళనాడు ప్రభుత్వం కొత్త చట్టం చేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను తాజాగా రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. 

మరోవైపు జల్లికట్టు తమిళనాడు ప్రతీక అని.. పోటీల్లో భద్రతా ప్రమాణాలు పాటిస్తామని కోర్టుకు తమిళనాడు ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. సుప్రీం తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇది చారిత్రాత్మక తీర్పు అని ఆ రాష్ట్ర న్యాయ మంత్రి ఎస్.రఘుపతి అన్నారు. జల్లికట్టులో జంతువులపై ఎలాంటి క్రూరత్వం ఉండదని చెప్పారు.

More Telugu News