E scooters: పెరగనున్న ఈ-స్కూటర్ల ధరలు?

E scooters may get pricier on proposed subsidy cut
  • ఒక్కో యూనిట్ విక్రయ ధరలో ప్రస్తుతం 40 శాతం సబ్సిడీ
  • దీన్ని 15 శాతానికి తగ్గించే ప్రతిపాదన
  • దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీలను తగ్గించే ప్రతిపాదనను కేంద్ర సర్కారు చురుగ్గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఫేమ్ -2 కింద ఒక్కో ద్విచక్ర వాహనంపై భారీగా సబ్సిడీ ఇస్తుండగా, ఈ పథకం గడువు 2024 మార్చితో ముగియనుంది. ఆ తర్వాత కూడా దీన్ని పొడిగించాలని వాహన పరిశ్రమ ఇప్పటికే కేంద్ర సర్కారును కోరింది. అప్పుడే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుందని, పర్యావరణ కాలుష్యం తగ్గించాలన్న లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుందని పరిశ్రమ తన అభిప్రాయాలను బలంగా కేంద్ర సర్కారు దృష్టికి తీసుకెళ్లింది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం విక్రయ ధరపై 40 శాతం వరకు సబ్సిడీని కేంద్ర సర్కారు ఇస్తోంది. ఈ సబ్సిడీని 15 శాతానికి పరిమితం  చేయాలన్నది కొత్త ప్రతిపాదన. దీన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తెరపైకి తీసుకొచ్చింది. సబ్సిడీని తగ్గించడం వల్ల మరిన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు దీన్ని పంచొచ్చని, తద్వారా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని పెంచొచ్చన్నది అభిప్రాయమని అధికార వర్గాలు వెల్లడించాయి. 

ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అప్పుడు ఒక్కో వాహనం ధర పెరిగిపోతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఫేమ్ ఇండియా కార్యక్రమాల అమలు కమిటీకి ఈ ప్రతిపాదన పంపగా, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు ఫేమ్ పథకం కింద మొత్తం 5.63 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు సబ్సిడీ ప్రయోజనం పొందాయి. 2024 మార్చి నాటికి మొత్తం 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ అందించాలన్నది లక్ష్యం. ఒక్కో వాహనం వారీ సబ్సిడీని తగ్గించకపోతే.. ప్రస్తుతం మిగిలి ఉన్న నిధులు త్వరగా ఖర్చయిపోతాయని అధికార వర్గాల సమాచారం. ప్రతీ నెలా సుమారు 45వేల యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ప్రస్తుతం అమ్ముడుపోతున్నాయి.
E scooters
electric two wheelers
subsidy
cut
proposal
fame scheme

More Telugu News