IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్ లో వీటికే అవకాశాలు పుష్కలం

  • ప్లే ఆఫ్ తొలి బెర్తు ఖరారు చేసుకున్న గుజరాత్ టైటాన్స్
  • సీఎస్కే, లక్నో, ముంబై, ఆర్సీబీ తర్వాతి స్థానాల్లో
  • వీటిల్లో లక్నో, సీఎస్కే కు ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువ
  • ముంబై, ఆర్సీబీకి అవకాశాలు మిగిలే ఉన్నాయ్
IPL 2023 Playoffs Race CSK and LSG have more chance of finishing in the top 4

ఐపీఎల్ రేసు తుది అంకానికి చేరువైంది. లీగ్ దశలో ఇంకా ఆరు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్ కు నాలుగు వెళ్లనున్నాయి. అందులో గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఆడిన 13 మ్యాచులకు గాను 9 విజయాలు, 18 పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది. సీఎస్కే, ఎల్ఎస్ జీ చెరో ఏడు విజయాలతో 15 పాయింట్లతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్ కూడా 7 విజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచులకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే గుజరాత్ కాకుండా మిగిలిన జట్లు కనీసం 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. అంటే ఎనిమిది విజయాలు కావాలి. 7 విజయాలతో 14 పాయింట్ల దగ్గర ఆగిపోతే ప్లే ఆఫ్ అవకాశాలు తగ్గిపోతాయి. ఎందుకంటే వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం వల్ల వచ్చిన బోనస్ పాయింట్ ఎల్ఎస్ జీ, సీఎస్కేకు అనుకూలంగా మారిందని చెప్పుకోవాలి. ఈ రెండు ఇంకా ఒక్కో మ్యాచులో ఆడాల్సి ఉంది. అవి విజయం సాధిస్తే 17 పాయింట్లతో ప్లే ఆఫ్ కు వెళ్లిపోతాయి. ఇక మరో స్థానం కోసమే మిగిలిన జట్ల మధ్య పోటీ ఉంటుంది. ప్లే ఆఫ్ కు వెళ్లేందుకు సీఎస్కేకి 96.9 శాతం అవకాశం ఉంటే, లక్నో జట్టుకు సైతం 96.9 శాతమే అవకాశం మిగిలివుంది.

ఇప్పటికే సన్ రైజర్స్, డీసీ జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లవని తేలిపోయింది. పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ జట్లు ఆరేసి విజయాలతో ఉన్నాయి. బెంగళూరు నేడు సన్ రైజర్స్ తో, వచ్చే ఆదివారం గుజరాత్ తో తలపడనుంది. ఈ రెండింటిలో బెంగళూరు విజయం సాధిస్తే అప్పుడు తన ఖాతాలో 8 పాయింట్లు పడతాయి. లక్నో, సీఎస్కే మిగిలిన మ్యాచుల్లో ఓడిపోతే అప్పుడు 15 పాయింట్ల వద్దే ఉండిపోతాయి. దీంతో బెంగళూరు 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు వెళ్లిపోతుంది.  

ఒకవేళ బెంగళూరు మిగిలిన మ్యాచుల్లో ఒక్కదానిలోనే గెలిస్తే 7 విజయాలు 14 పాయింట్ల దగ్గర నిలిచిపోతుంది. అప్పుడు ముంబై జట్టు మిగిలిన మ్యాచ్ కీలకం అవుతుంది. సన్ రైజర్స్ పై ముంబై విజయం సాధిస్తే అప్పుడు ప్లేఆఫ్ కు ముంబై వెళ్లిపోయినట్టే. ఒకవేళ బెంగళూరు ఒక విజయం సాధించి, ముంబై తన చివరి మ్యాచ్ ఓడిపోతే రెండు జట్ల పాయింట్లు సమానం అవుతాయి. అప్పుడు నెట్ రన్ రేటు కీలకంగా మారుతుంది. ఒకవేళ చెన్నై చివరి మ్యాచు విజయం సాధిస్తే, బెంగళూరు రెండింటిలోనూ గెలిస్తే, ముంబై కూడా చివరి మ్యాచ్ గెలిస్తే, లక్నో జట్టు కేకేఆర్ పై ఓడిపోతే.. లక్నో ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 

ముంబై జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు 87.5 శాతం మేర ఉన్నాయి. ఆర్సీబీ అవకాశాలు కేవలం 25 శాతమనే చెప్పుకోవాలి. ఇప్పటి సీక్వెన్స్ చూస్తుంటే గుజరాత్ కాకుండా, చెన్నై, ముంబై, లక్నో, ఆర్సీబీకి ప్లే అవకాశాలు మిగిలి ఉన్నాయి. శనివారం నాటి మ్యాచ్ ల ఫలితాలతో స్పష్టత వచ్చేస్తుంది.

More Telugu News