cabinet shuffle: కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పు.. న్యాయశాఖకు కొత్త మంత్రి

  • న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు తొలగింపు
  • కొత్త మంత్రిగా సహాయ హోదాలో అర్జున్ రామ్ మేఘ్వాల్
  • అనూహ్య నిర్ణయం తీసుకున్న మోదీ సర్కారు
Govt shuffles cabinet Arjun Ram Meghwal replaces Kiren Rijiju as Law Minister

ఉన్నట్టుండి కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పు చోటు చేసుకుంది. మోదీ సర్కారు కేంద్ర న్యాయ శాఖ మంత్రిత్వ బాధ్యతల నుంచి కిరణ్ రిజిజును తప్పిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఎర్త్ సైన్స్ శాఖ బాధ్యతలు కేటాయించారు. కొత్త న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్ బాధ్యతలు చూస్తున్నారు. దీనికి అదనంగా న్యాయ మంత్రిగా స్వతంత్ర హోదాలో సేవలు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది.

కిరణ్ రిజిజును తప్పించడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న చర్చ నడుస్తోంది. సుప్రీంకోర్టుకు, కేంద్రానికి మధ్య కొన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలు నెలకొనడం తెలిసిందే. అందులో సుప్రీంకోర్టు కొలీజియం ఒకటి. ఇందులో ఏ మాత్రం పారదర్శకత లేదని రిజిజు తీవ్రంగా విమర్శించగా, ఇది అత్యుత్తమైనదిగా సుప్రీంకోర్టు సమర్థించుకుంది. కేంద్ర ప్రభుత్వ నామినీకి జడ్జీల నియామకాల్లో చోటు కల్పించాలని లేఖ సైతం రాశారు. దీన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు కొందరు భారత్ వ్యతిరేక ముఠాలో భాగం అవుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైనా విమర్శలు వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన రిజిజు మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో క్రీడల మంత్రిగానూ సేవలు అందించారు. 

తాజా మార్పుపై శివసేన విమర్శనాత్మకంగా స్పందించింది. ‘‘మహారాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇబ్బందికరంగా రావడం వల్లేనా? లేక మోదానీ-సెబీ దర్యాప్తు కారణమా?’’ అంటూ శివసేన నేత ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ లో విమర్శించారు. కేంద్ర సర్కారు తన ప్రతిష్ఠను కాపాడుకునేందుకు రిజిజును తప్పించినట్టు కాంగ్రెస్ పార్టీ నేత ఆల్కా లంబా సైతం విమర్శించారు.

More Telugu News