Pakistan: ఇకపై సహించేదిలేదు.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక

  • అమరవీరులను అవమానిస్తే ఊరుకోబోమన్న అసీమ్ మునీర్
  • దేశ చరిత్రలో చీకటి దినంగా మే 9 మిగిలిపోతుందని వ్యాఖ్య
  • సియాల్ కోట్ గారిసన్ లో పర్యటించిన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్
Pak Army Chief Warns Imran Khans Supporters

దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను అవమానిస్తే ఇకపై సహించబోమని పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను గురువారం హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు నిరసనగా మే 9న అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఆర్మీ చీఫ్ పర్యటించారు. సియాల్ కోట్ గారిసన్ లోని అమరవీరుల స్మారక చిహ్నాలపై దాడిచేయడాన్ని ఆయన ఖండించారు. అమరవీరుల గుర్తుగా నిర్మించుకున్న ఈ స్మారక చిహ్నాలు దేశానికి, దేశంలోని ప్రజలకు గర్వకారణమని ఆయన చెప్పారు. దేశంలోని ప్రతీ ఒక్కరికీ ఇవి స్ఫూర్తిగా నిలుస్తాయని, సైనికుల త్యాగాలను గుర్తుచేస్తాయని అసీమ్ మునీర్ పేర్కొన్నారు. అలాంటి జ్ఞాపకాలను తుడిచేయాలని ప్రయత్నించడం క్షమించరాని నేరమని అన్నారు.

మే 9న జరిగిన విధ్వంసం ప్రీప్లాన్డ్ గా జరిగిందేనని అసీమ్ మునీర్ ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను, వారి కుటుంబాలను ఎల్లప్పుడూ ఉన్నతంగానే చూడాలని పాక్ ఆర్మీ కోరుకుంటుందని చెప్పారు. వారి గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఈమేరకు సియాల్ కోట్ గారిసన్ సందర్శించిన తర్వాత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసీమ్ మునీర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News