Yuva Galam Padayatra: నంద్యాలలో యువగళం జైత్రయాత్ర.. లోకేశ్‌కు ప్రజల నీరాజనం

  • నంద్యాల నియోజకవర్గంలో యువగళం
  • 102వ రోజు యాత్రలో లోకేశ్‌కు ప్రజల నీరాజనం
  • బహిరంగసభలో లోకేశ్ ప్రసంగం, జగన్‌పై విమర్శలు
  • టీడీపీ హయాంలోనే నంద్యాల అభివృద్ధి జరిగిందని వ్యాఖ్య
Lokesh yuvagalam in nadyal

నంద్యాల పట్టణంలో నేడు (102వ రోజు) యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు  ప్రజలు  నీరాజనాలు పలికారు. యువగళం పాదయాత్రతో నంద్యాల రోడ్లు కిక్కిరిశాయి. లోకేశ్ ని చూసేందుకు జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. జై లోకేశ్, జై తెలుగుదేశం నినాదాలతో నంద్యాల హోరెత్తింది. రోడ్డుకి ఇరు వైపులా ఉన్న భవనాలు ఎక్కి లోకేశ్‌కు ప్రజలు అభివాదం చేశారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులను కలుస్తూ అందరి సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ భరోసా కల్పించారు.102వ రోజు యువనేత 8కి.మీ దూరం నడవగా ఇప్పటి వరకు 1301.8 కి.మీ పాదయాత్ర సాగింది.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. పేదోడినంటూ జగన్ జబర్‌దస్త్ కామెడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తల్లీ, చెల్లి పారిపోయారు కాబట్టి జగన్ ఒంటరి వాడేనని వ్యాఖ్యానించారు. యువగళం ప్రజాగళమై మహోద్యమంగా మారిందన్న యువనేత తమతో పెట్టుకుంటే మాటాష్ అయిపోతావని జగన్‌ను హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో అవినీతిని  లోకేశ్ ఎత్తిచూపారు. సీఐడీ జగన్ కక్షసాధింపు డిపార్ట్‌మెంట్‌గా మారిందన్నారు. నంద్యాలలో సండే ఎమ్మెల్యే శిల్పా రవి అవినీతి అనంతమని వ్యాఖ్యానించారు. 

టీడీపీ హయాంలోనే నంద్యాల అభివృద్ధి
పాదయాత్రలో భాగంగా జగన్ నంద్యాల వచ్చినప్పుడు అగ్రిగోల్డ్, కేశవ రెడ్డి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడని లోకేశ్ చెప్పారు. కానీ, ఆ హామీ గాల్లో కలిసిపోయిందని విమర్శించారు. టీడీపీ హయాంలో నంద్యాలకు స్వర్ణయుగమని లోకేశ్ వ్యాఖ్యానించారు. రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. పేదవాళ్లకు ఇళ్లు, రోడ్ల విస్తరణ, సాగు, తాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది టీడీపీ అని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 10 వేల టిడ్కో ఇళ్లు నిర్మిస్తే వాటిని ప్రజలకు ఇవ్వలేని దద్దమ్మ సండే ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులు కల్పించి ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నంద్యాల టౌన్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామన్నారు.  

అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తాం!
నంద్యాల జిల్లా ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్యులు, మందుల కొరత ఉందని నారా లోకేశ్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని చికిత్సలు అందేలా ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పిస్తామని అన్నారు. నంద్యాల నుంచి భీమవరం వెళ్లాలంటే మద్దిలేరు వాగు దాటాలని ఆయన చెప్పారు. అయితే, టీడీపీ ప్రభుత్వంలో వంతెన నిర్మాణం కోసం టెండర్లు కూడా పిలిచామని గుర్తు చేశారు. కానీ, సండే ఎమ్మెల్యే కమిషన్ కక్కుర్తితో పనులు ఆపేసారని చెప్పారు. నంద్యాలలో మెయిన్ సెంటర్లలో నిత్యం వందల మందికి కడుపు నింపిన అన్న క్యాంటిన్‌ను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. విజయ డైరీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి, కార్మికుల తొలగింపు అన్ని తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


103వ రోజు (18.5.2023) పాదయాత్ర వివరాలు:
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)
2.00  – నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద రైతులతో ముఖాముఖి.
4.00  – నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద 1,300 కి.మీ. మైలురాయి ఆవిష్కరణ.
4.45 – కానాలలో జాతీయరహదారి విస్తరణ బాధితులతో సమావేశం.
5.45 – హెచ్ఎస్ కొట్టాలలో స్థానికులతో సమావేశం.
6.20 – ఎం.చిన్నకొట్టాలలో స్థానికులతో సమావేశం.
6.55  – జూలపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులతో సమావేశం.
7.45 – పసరుపాడులో స్థానికులతో సమావేశం.
9.30 – తెల్లాపురిలో స్థానికులతో సమావేశం.
10.05 – రాయపాడులో స్థానికులతో సమావేశం.
10.55 – రాయపాడు శివారు విడిది కేంద్రంలో బస
*****************

More Telugu News