Madhya Pradesh: తల్లిని కావాలనుకుంటున్నా, భర్తకు పెరోల్ ఇప్పించండి: ఓ మహిళ అభ్యర్థన

  • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
  • పెళ్లయిన కొద్ది రోజులకే  వ్యక్తి అరెస్టు, జీవిత ఖైదు
  • భర్తకు పెరోల్ కోసం జైలు అధికారులకు భార్య దరఖాస్తు
madhyapradesh woman desiring to have baby seeks parole for her husband

బిడ్డను కనాలనుకున్న ఓ మహిళ జైల్లో ఉన్న తన భర్తకు పెరోల్ ఇవ్వాలంటూ తాజాగా దరఖాస్తు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌కు చెందిన దారాసింగ్‌కు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్ని రోజులకే ఓ హత్య కేసులో దారా పోలీసులకు చిక్కాడు. చివరకు న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. 

అయితే, బిడ్డను కనాలనుకుంటున్న అతడి భార్య తన భర్తకు పెరోల్ ఇప్పించాలంటూ తాజాగా జైలు అధికారులను అభ్యర్థించింది. ఈ మేరకు మహిళ, ఆమె కుటుంబసభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, మహిళ దరఖాస్తును శివ్‌పురి ఎస్పీకి పంపినట్టు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ తెలిపారు. జైలు నిబంధనల ప్రకారం..జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీని రెండేళ్ల తరువాత పెరోల్‌పై విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. పెరోల్ ఇచ్చేదీ లేనిదీ అతడి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్న ఆయన.. ఇలాంటి కేసుల్లో తుది నిర్ణయం జిల్లా కలెక్టర్ తీసుకుంటారని వెల్లడించారు. 

కాగా, గతంలో రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ ఇలాంటి అభ్యర్థనే చేసింది. దీనిపై విచారించిన కోర్టు  జైల్లో ఉన్న ఆమె భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.

More Telugu News