Rahul Gandhi: రాహుల్ గాంధీ బుజ్జగింపుతో పంతం వీడిన డీకే

  • సీఎం పదవి విషయంలో వెనక్కి తగ్గిన కాంగ్రెస్ కర్ణాటక చీఫ్
  • డీకే శివకుమార్ డిమాండ్లు అన్నింటికీ ఓకే చెప్పిన రాహుల్ గాంధీ
  • పార్టీ కోసం డీకే పడిన కష్టం తమకు తెలుసన్న అగ్రనేత  
Rahul gandhi And DK Shivakumar meeting successful

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి తనకే ఇవ్వాలంటూ పంతం పట్టిన డీకే శివకుమార్ వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ బుజ్జగింపుతో పంతం వీడారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని స్వాగతించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ సంప్రదింపులు సఫలం అయ్యాయి.

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయంలో డీకే శివకుమార్ అసంతృప్తిని చల్లార్చేందుకు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ఫోన్ లో, స్వయంగా డీకేతో పలుమార్లు మాట్లాడారు. పార్టీలో ఓ వ్యక్తిగా కాకుండా తమ కుటుంబంలో ఒకరిగా చూస్తున్నానని, పెద్దన్నగా భావిస్తున్నానని డీకేతో రాహుల్ చెప్పినట్లు తెలిసింది. 

పార్టీలో డీకేకు అన్యాయం జరగదని, ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కోసం ఆయన పడిన కష్టం తమకు తెలుసని, ఈ ఒక్కసారికి తమ మాట వినాలని డీకే శివకుమార్ ను రాహుల్ గాంధీ కోరారు. డీకేతో దాదాపు గంట పాటు రాహుల్ గాంధీ ఏకాంతంగా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ పదే పదే రిక్వెస్ట్ చేయడంతో డీకే శివకుమార్ తన పంతాన్ని వీడినట్లు తెలుస్తోంది.

More Telugu News