Karnataka: కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

  • కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనా?
  • సిద్ధూవైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు
  • సాయంత్రం అధికారికంగా ప్రకటన
  • డీకే శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి
  • డీకే, సిద్ధరామయ్యలతో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే చర్చలు
Big twist in karnataka politics

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎంపికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసేందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నేటి సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడనుంది. గురువారం సిద్ధరామయ్య ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. కాసేపట్లో పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ కానున్నారు.

ఖర్గేతో భేటీలో గొంతు పెంచిన డీకే
అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డీకే, సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ఈ భేటీలో డీకే గొంతు పెంచినట్టు సమాచారం. సీఎం పదవి విషయంలో ఇద్దరి ముందు ఖర్గే పలు ప్రతిపాదనలు చేశారు. అయితే, రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోవడానికి ఎంతో కష్టపడ్డానని, ముఖ్యమంత్రి పదవిని వదులుకోలేనని డీకే శివకుమార్ తేల్చిచెప్పారు.

ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేయకపోతే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం చేయాలని హైకమాండ్ కు డీకే సూచించారట. సిద్ధరామయ్యకు సీఎం పదవిని కట్టబెట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.  ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకుందామంటూ సిద్ధరామయ్య చేసిన ప్రతిపాదననూ డీకే తోసిపుచ్చారు.

More Telugu News