PK Mishra: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టు సీజే పీకే మిశ్రా... కొలీజియం సిఫారసు

  • రెండు నియామకాలకు కొలీజియం సిఫారసు
  • ఏపీ హైకోర్టు సీజేతో పాటు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ ల పేర్లు సిఫారసు
  • ఆమోదించనున్న కేంద్రం
Collegium recommends AP High Court CJ PK Mishra as Supreme Court judge

సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ ల పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. వీరిద్దరికీ సుప్రీంకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించాలని కేంద్రానికి సూచించింది. 

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 32 మంది న్యాయమూర్తులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాజా ప్రతిపాదనలకు ఆమోద ముద్రపడితే సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 34కి పెరుగుతుంది. 

గత రెండ్రోజుల వ్యవధిలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ ఎమ్మార్ షా, దినేశ్ మహేశ్వరి పదవీ విరమణ చేశారు. వారిద్దరి స్థానాలను తాజా నియామకాలతో భర్తీ చేయనున్నారు. కాగా, కొలీజియం సిఫారసులను కేంద్రం ఆమోదించి విశ్వనాథన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే, సీనియారిటీ ప్రకారం ఆయన 2030లో సీజేఐ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పదవిలో 2031 మే 25 వరకు కొనసాగుతారు. 

రోస్టర్ ప్రకారం జస్టిస్ జేబీ పార్థీవాలా 2028లో సీజేఐ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. అనంతరం విశ్వనాథన్ సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందుతారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని కొలీజియంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా సభ్యులుగా ఉన్నారు.

More Telugu News