Talasani: గోషామహల్ నియోజకవర్గ పరిధిలో బస్తీ దవాఖానా ప్రారంభించిన మంత్రి తలసాని

  • పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామన్న తలసాని  
  • ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటన
  • తెలంగాణ ఏర్పాటు తర్వాత మరింత అందుబాటులోకి వైద్య సేవలు
Talasani and Rajasingh in Basthi Dawakana programme

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మజ్లిస్ ఎమ్మెల్యే మీర్జా రహమత్ బేగ్ లతో కలిసి గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ పౌండ్రీలో గల నేతాజీ కమ్యూనిటీ హాల్ లో, జాంబాగ్ డివిజన్ లోని సుబాన్ పురా కమ్యూనిటీ హాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఈ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 350 బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటికే 153 బస్తీ దవాఖానాలు పని చేస్తుండగా, కొత్తగా 14 బస్తీ దవాఖానాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ బస్తీ దవాఖానాల్లో వైద్య పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా, మందులు కూడా ఉచితమని చెప్పారు. అవసరమైతే గాంధీ, నిమ్స్, ఉస్మానియాలకు రిఫర్ చేస్తామన్నారు.

More Telugu News