Narendra Modi: ఇప్పుడు అవినీతి లేదు.. బంధుప్రీతి లేదు: 71 వేల మందికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ప్రధాని

  • గతంలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేదన్న మోదీ
  • దరఖాస్తు పొందేందుకే గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సి వచ్చేదని వ్యాఖ్య
  • ఇప్పుడు అప్లికేషన్ నుంచి ఫలితాల దాకా అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని వెల్లడి
rozgar mela pm modi distributes about 71000 appointment letters says changes in system ended corruption and nepotism

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 71 వేల మందికి నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ పంపిణీ చేశారు. ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం కష్టంగా ఉండేదని.. దరఖాస్తు పొందేందుకే గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సి వచ్చేదని అన్నారు.

కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. రిక్రూట్ మెంట్ విధానం మారిందని, ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం సులభమైందని చెప్పారు. అప్లికేషన్ నుంచి ఫలితాల దాకా అన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని, కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కూడా అవసరం లేదని అన్నారు. కొత్త విధానంతో రిక్రూట్ మెంట్ విషయంలో అవినీతి, బంధు ప్రీతిని నిర్మూలించామని వివరించారు.

భారత ప్రభుత్వం అందించే ప్రతి పథకం, ప్రతి విధానం యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. ఈపీఎఫ్ఓ గణాంకాలను చూస్తే.. 2018-19లో 4.5 కోట్ల మందికి పైగా కొత్తగా ఉద్యోగాలు పొందారని తెలుస్తోందని చెప్పారు. స్టార్టప్ సెక్టార్ లో భారతదేశం విప్లవాత్మక అభివృద్ధి సాధించిందని, 2014 ముందు వందల్లో ఉండవేని, ఇప్పుడు లక్షకు పైనే ఉన్నాయని తెలిపారు.  

అపాయింట్‌మెంట్ లెటర్లు పొందిన వారు.. గ్రామీణ డాక్ సేవకులు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్‌, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజనల్ ఆఫీసర్, ట్యాక్స్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్, ఇన్ స్పెక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్స్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ప్రిన్సిపాల్, టీజీటీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ప్రొఫెసర్.. వంటి పోస్టుల్లో చేరనున్నారు.

గతేడాది అక్టోబర్ లో రోజ్ గార్ మేళాను ప్రధాని ప్రారంభించారు. 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు మోదీ 2.9 లక్షల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారని.. తాజా కార్యక్రమంతో ఆ సంఖ్య 3.6 లక్షలకు చేరుకుందని కేంద్రం వివరించింది.

More Telugu News