Vodafone: 11,000 మందిని తొలగిస్తున్న వొడాఫోన్

  • ప్రకటించిన సంస్థ సీఈవో మార్గరిటా డెల్లా వల్లే
  • సంస్థను మరింత సరళంగా మార్చనున్నట్టు వెల్లడి
  • కస్టమర్లకు నాణ్యమైన సేవలపై దృష్టి సారిస్తామని ప్రకటన
Vodafone announces massive layoffs plans to cut 11000 jobs and reallocate resources

అంతర్జాతీయ కంపెనీలు వరుసగా ఉద్యోగాలకు కోతలు పెడుతున్నాయి. అమెజాన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18వేల మందిని తొలగించగా, మరో 9,000 మందిని కూడా ఇంటికి పంపించనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇందులో భారత్ నుంచే 500 మంది ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు బ్రిటిష్ టెలికం జెయింట్ వొడాఫోన్ సైతం 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. కంపెనీ షేరు ధర రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయిన సమయంలో ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు, కస్టమర్ల సేవల అనుభవాన్ని పెంచేందుకు పునర్ నిర్మాణంపై దృష్టి పెడతామని వొడాఫోన్ ప్రకటించింది. 

కంపెనీ వ్యయాలను పెద్ద మొత్తంలో తగ్గించుకోవడం ఉద్యోగుల తొలగింపునకు కారణంగా ఉంది. సులభంగా, చురుగ్గా సంస్థ నిర్మాణం ఉండాలని కోరుకుంటున్నట్టు వొడాఫోన్ నూతన సీఈవో మార్గరిటా డెల్లా వల్లే తెలిపారు. ఆమె గత నెలలో వొడాఫోన్ కొత్త సీఈవోగా నియమితులయ్యారు. 

‘‘నా ప్రాధాన్యం కస్టమర్లు, సులభత్వం, వృద్ధి. సంస్థను మరింత సరళంగా మార్చేస్తాం. సంక్లిష్టతలను తగ్గించి పోటీతత్వాన్ని పెంచుతాం. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించడంపై వనరులను వినియోగిస్తాం’’ అని ప్రకటించారు. 11,000 మందిని తొలగించడం అనేది వొడాఫోన్ చరిత్రలోనే అతిపెద్ద కోత కావడం గమనార్హం. వొడాఫోన్ నిర్ణయం భారత్ లోని వొడాఐడియా ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడదు.

More Telugu News